తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో ప్రభుత్వం జాప్యం చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. కమిటీ పేరుతో కాలయాపన కాకుండా ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఇచ్చిన భూపోరాటం పిలుపు నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఉద్యమకారుల హక్కుల కోసం మాత్రమే పని చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డులు తదితర హామీలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలన్నారు.
కేశవరావు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా అర్హులైన ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌కు తగిన గౌరవం కల్పిస్తూ, ఆగస్టు 6లోపు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
