హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం వెలుగుచూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సదరు మహిళలంతా ఒమన్ ఎయిర్‌వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తనిఖీలు నిర్వహిస్తుండగా, వారు సమర్పించిన వీసాలు నకిలీవని అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇమ్మిగ్రేషన్ సిబ్బంది వారిని వెంటనే అదుపులోకి తీసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ క్రైమ్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.
