అమెజాన్ ప్రైమ్‌కు షాక్.. తిరగబడ్డ చందాదారులు.. యాడ్స్ పంచాయితీపై కోర్టులో దావా!

అమెజాన్ ప్రైమ్‌కు షాక్.. తిరగబడ్డ చందాదారులు.. యాడ్స్ పంచాయితీపై కోర్టులో దావా!

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ ' చట్టపరమైన చిక్కుల్లో పడింది. సినిమాలు, సిరీస్ లు చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ చొప్పించడం.. అవి వద్దనుకుంటే అదనపు వసూళ్లు చేయడం ఆ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఏకపక్ష దోపిడీపై ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ ( ACCC ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టులో అమెజాన్ పై కోర్టులో దావా వేసింది.

మధ్యలో యాడ్స్ ఏంటి బాస్?

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. ఆస్ట్రేలియాలో 2024 నుంచి ప్రైమ్ వీడియోలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అమెజాన్ ప్రకటనలను ప్రారంభించింది. అయితే, అప్పటికే ఏడాది మొత్తానికి 79 డాలర్లు చెల్లించి వార్షిక సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న దాదాపు 8.5 లక్షల మంది చందాదారులు తాము మోసపోయామని మండిపడుతున్నారు. తాము యాడ్స్ లేని (Ad-Free) కంటెంట్ కోసం డబ్బులు కడితే, బలవంతంగా యాడ్స్ చూపించడం ఏంటని తిరగబడ్డారు.

నో యాడ్స్.. కావాలంటే ఎక్స్‌ట్రా మనీ..

ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రకటనల గొడవ ఇంతటితో ఆగలేదు. మీకు యాడ్స్ లేకుండా ప్రశాంతంగా సినిమా కావాలా? అయితే పాత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు నెలకు అదనంగా మరో 2.99 ఆస్ట్రేలియన్ డాలర్లు కట్టండి అంటూ అమెజాన్ కొత్త రూల్స్ తెచ్చింది. అంటే ముందే పూర్తి రుసుము చెల్లించిన కస్టమర్ల సర్వీస్‌ను అమెజాన్ డౌన్‌గ్రేడ్ చేసిందన్నమాట. నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య కాలంలో అమెజాన్ పెట్టిన ఈ అన్యాయమైన నిబంధనల వల్ల దాదాపు 10 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు తీవ్రంగా నష్టపోయారని ACCC కోర్టుకు తెలిపింది.

నష్టపరిహారం కట్టాల్సిందే..

వినియోగదారుల నుంచి భారీగా వచ్చిన ఫిర్యాదులతో ACCC రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో అమెజాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. బాధితులైన వినియోగదారులందరికీ అమెజాన్ సంస్థ తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు భారీ జరిమానా విధించాలని న్యాయస్థానాన్ని కోరింది.

మరోవైపు ఈ న్యాయపోరాటంపై అమెజాన్ ఆస్ట్రేలియా ప్రతినిధి స్పందించారు. మేం ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్నాం. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాం అని చెప్పుకొచ్చారు. దశాబ్ద కాలంగా యాడ్-ఫ్రీ సర్వీస్‌గా పేరు తెచ్చుకున్న ప్రైమ్ వీడియో.. కేవలం యాడ్స్ ,అదనపు వసూళ్ల ఆశతో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్నేషనల్ పంచాయితీ చివరికి ఎటు తేలుతుందో చూడాలి.