బెంగళూరులోని ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ 'క్యాప్‌జెమిని' క్యాంపస్‌లో ఉన్న ఒక డేకేర్ సెంటర్‌లో గుండెలవసే ఘటన వెలుగుచూసింది. అక్కడ పని చేసే సిబ్బంది, ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగుల చిన్న పిల్లలను క్రూరంగా వేధిస్తున్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ దారుణాన్ని చూసి భరించలేక యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన ఒక విజిల్‌బ్లోయర్ ని సదరు డేకేర్ సెంటర్ ఉద్యోగం నుంచి తొలగించడం గమనార్హం.
అసలు అక్కడ ఏం జరిగింది?
ఈ డేకేర్ సెంటర్లో సుమారు 50 నుండి 60 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకోగా, ప్రతిరోజూ 15 నుండి 20 మంది పిల్లలు వస్తుంటారు. పిల్లలు ఏడ్చినా లేదా అల్లరి చేసినా వారిని సైలెంటుగా ఉంచడానికి కేర్ టేకర్లు నరకం చూపించేవారని తెలుస్తోంది.
బయటపెట్టిన భయంకరమైన వీడియోలో:
కేవలం రెండేళ్ల వయసున్న పసిపిల్లలను వాషింగ్ మెషీన్లలో కూర్చోబెట్టి, వారిపైకి స్పీడ్‌గా నీటిని పిచికారీ చేయడం కనిపించింది. ఇంకా పిల్లల ఏడుపు ఆపడానికి వారిని చీకటి బాత్రూమ్‌లలో వేసి తాళాలు పెట్టడం వంటి దారుణాలు బయటపడ్డాయి. "ఇది నిన్న మొన్నటి కథ కాదు, చాలా కాలంగా జరుగుతోంది. గతంలో కూడా ఒకరు దీనిపై సూపర్‌వైజర్‌కు కంప్లైంట్ చేశారు, కానీ అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ నిజాలను బయటపెట్టిన వ్యక్తిని ఏకంగా ఉద్యోగం నుంచే తీసేశారు."
అని ప్రొబేషన్ అధికారి చెప్పారు.
రంగంలోకి పోలీసులు
ఈ దారుణమైన వీడియోలు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. నిజాన్ని బయటపెట్టిన వ్యక్తిని సంప్రదించి వీడియో ఆధారాలు సేకరించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పిల్లలను వేధించిన ఐదుగురు సంరక్షకులపై కేసు నమోదైంది.
క్యాప్‌జెమిని కంపెనీ స్పందన
ఈ ఘటనపై క్యాప్‌జెమిని సంస్థ స్పందిస్తూ.. మా ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతే మాకు అన్నిటికంటే ముఖ్యమని తెలిపింది. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని చెప్తూ, ముందు జాగ్రత్త చర్యగా ఆ డేకేర్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది
