తెలంగాణలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపలికి వెళ్లేందుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్‌లు పూర్తిస్థాయిలో అందించలేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇతర రాష్ట్రాల తరహాలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. పుస్తకాలు, యూనిఫామ్‌ల విక్రయ కేంద్రాలుగా విద్యాసంస్థలను మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకుని, అలాంటి సంస్థలను సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
