కార్ల స్మగ్లింగ్ కేసులో నోరు విప్పిన దుల్కర్ సల్మాన్.. నాకేం తెలియదంటూ స్టేట్‌మెంట్!

కార్ల స్మగ్లింగ్ కేసులో నోరు విప్పిన దుల్కర్ సల్మాన్.. నాకేం తెలియదంటూ స్టేట్‌మెంట్!

మోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను కస్టమ్స్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.  లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసులో ఆయన నుంచి కీలక విషయాలు రాబ్టట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఆపరేషన్  నుమ్ ఖోర్' దర్యాప్తులో భాగంగా కొచ్చిలోని కస్టమ్స్ ఆపీసులో దుల్కర్ ను సుదీర్గంగా నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్ మెంట్స్ ను రికార్డు చేశారు.

లక్కీ భాస్కర్ కార్లు సీజ్..

ఆపరేషన్ లో భాగంగా దుల్కర్ సల్మాన్‌కు చెందిన నాలుగు ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కార్లను అధికారులు గతంలోనే సీజ్ చేశారు. వీటిలో రెండింటిని దుల్కర్ కోర్టు ద్వారా తాత్కాలికంగా విడిపించుకోగా, మిగిలిన రెండు వాహనాలు ఇంకా కస్టమ్స్ స్వాధీనంలోనే ఉన్నాయి. దుల్కర్ వద్ద ఉన్న మరికొన్ని లగ్జరీ కార్ల వివరాలను, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సమర్పించాలని అధికారులు ఆదేశించారు.  

అసలు ఈ 'ఆపరేషన్ నుమ్‌ఖోర్' ఏంటి?

భూటాన్, నేపాల్ సరిహద్దుల గుండా పాత, డీకమిషన్డ్ లగ్జరీ వాహనాలను నకిలీ పత్రాలు సృష్టించి భారతదేశంలోకి అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ ముఠా నకిలీ రిజిస్ట్రేషన్లతో కోట్ల రూపాయల కస్టమ్స్ పన్ను ఎగవేస్తున్నట్లు తేలింది. ఈ భారీ స్మగ్లింగ్ కుంభకోణంపై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ గతేడాది సెప్టెంబర్ నుంచే నిఘా పెట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా కేరళ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 60 లగ్జరీ వాహనాలను సీజ్ చేయగా, స్మగ్లింగ్ సిండికేట్‌తో సంబంధమున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. 
 
నాకేం తెలియదు అంటున్న దుల్కర్..

అయితే ఈ విచారణలో దుల్కర్ సల్మాన్ కస్టమ్స్ అధికారులకు కీలక సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను ఆ లగ్జరీ కార్లన్నింటినీ లీగల్ ఛానెల్స్ ద్వారానే, పూర్తి డబ్బులు చెల్లించి కొనుగోలు చేశానని.. అవి భూటాన్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేయబడ్డాయనే విషయం తనకు అస్సలు తెలియదని దుల్కర్ స్పష్టం చేశారు. ఈ కేసులో దుల్కర్‌తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో కూడా గతంలో తనిఖీలు జరిగాయి. ప్రస్తుతానికి దుల్కర్ ఇచ్చిన సమాచారంతో ఈ స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు..