ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంపు.. దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త చట్టం

ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంపు.. దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త చట్టం
  • తెలంగాణలో రోజువారీ కూలీ రూ. 308కి పెంపు 
  • గరిష్టంగా సిక్కింలో రూ.450.. 
  • యూపీ, బెంగాల్‌‌‌‌‌‌‌‌లో రూ. 300 
  • 11 రాష్ట్రాల్లో 15 శాతం పెంపు
  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం 
  • నేడు వీబీ జీరామ్​జీపై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీ–జీ రామ్ జీ(వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌‌‌‌‌‌‌‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) చట్టం బుధ‌‌‌‌‌‌‌‌వారం దేశ‌‌‌‌‌‌‌‌వ్యాప్తంగా అమల్లోకి వ‌‌‌‌‌‌‌‌చ్చింది. దీంతో కూలీలకు పనిదినాలు, వేతనాల్లో మార్పులు జరిగాయి. ఈ నూతన చట్టం ప్రకారం.. పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచగా.. దేశవ్యాప్తంగా కనీస రోజువారీ వేతనాన్ని రూ.300 నుంచి రూ.409 వరకు సవరిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త వేతనాల ప్రకారం తెలంగాణలో ఉపాధి కూలీల దినసరి వేతనం రూ. 308కి పెరిగింది. 

గ‌‌‌‌తంలో రూ. 307 ఉండగా, ఇప్పుడు కేవలం ఒక రూపాయి పెరిగింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో రోజువారీ వేతనం రూ.307 ఉండగా.. రూ. 5 మేరకు పెరిగి రూ.312కు చేరింది. మొత్తంగా దేశంలోని11 రాష్ట్రాల్లో కూలీల వేతనాలు15 శాతం వరకు పెరిగాయని కేంద్రం పేర్కొంది. మిగిలిన రాష్ట్రాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కొత్త వేతనాల వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉపాధి హామీ కూలీలకు లబ్ధి చేకూరనుంది. 

కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా సిక్కింలోని జ్ఞాతాంగ్, లాచుంగ్, లాచెన్ గ్రామ పంచాయతీల‌‌‌‌ కూలీలకు రూ. 450 చెల్లించనున్నారు. సిక్కింలోని ఇతర ప్రాంతాల్లో కూలీ రూ. 300గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో రూ. 345, పుదుచ్చేరిలో రూ. 347, లక్షద్వీప్‌‌‌‌లో రూ. 348గా నిర్ణయించారు. సవరించిన వేతనాలు ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి వ‌‌‌‌చ్చాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూలీ రూ. 300 ఉండగా.. అండమాన్ నికోబార్ దీవుల్లో గరిష్టంగా రూ.367 వరకు ఉండనుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిణి ఆర్ భాజిభాకరే ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత కూలీలకు కొంత ఊరటనివ్వనుంది.

నేడు రాష్ట్ర సర్కారు కీల‌‌‌‌క నిర్ణయం

గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గడువు దేశవ్యాప్తంగా గత నెల మంగళవారం నాటితో ముగిసింది. దాని స్థానంలో వీబీ–జీ రామ్​జీ పథకాన్ని కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టగా, ఇది బుధవారం నుంచి ప్రారంభమైంది. 2026-–27 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం అమలు కోసం కేంద్రం తెలంగాణకు రూ.3,825.31 కోట్లు మంజూరు చేసింది. 

దీనికి రాష్ట్రం తన వాటా కింద 40 శాతం నిధులను కేటాయించాలి. అంటే రూ.2,550.21 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర నిధులు ఆగకూడదన్న ప్రధాన ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టం అమలుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీబీ జీ రామ్​జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనికి సంబంధించి శాసనసభలో తీర్మానం చేసింది. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఉపసంఘం రెండు సార్లు సమావేశమై సుదీర్ఘంగా చ‌‌‌‌ర్చించింది. అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైతే న్యాయ పోరాటం చేయాల‌‌‌‌ని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త పథకం అమలుపై గురువారం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో కీల‌‌‌‌క నిర్ణయం తీసుకోనున్నారు.  

ప‌‌‌‌ని దినాలు 100 నుంచి 125కు.. 

ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది కేంద్రం రాష్ట్రానికి 8.50 కోట్ల పని దినాలను కేటాయించగా.. వాటిలో రాష్ట్రం 8 కోట్ల పనిదినాలను మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన పని దినాలను ప్రస్తుతం కొనసాగుతున్న మహిళా సంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ, అంగన్‌‌‌‌వాడీ, పాఠశాల గదులు, ప్రహరీల వంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు అనుమతించింది. బుధవారం నుంచి ప్రారంభ‌‌‌‌మైన కొత్త పనులను వీబీ జీ రామ్​జీ కిందే చేపట్టాలని కేంద్రం పేర్కొంది. ఈ పథకానికి అనుగుణంగా కొత్త వెబ్‌‌‌‌సైట్ కూడా ప్రారంభమైంది.

 ఇప్పటివరకు ఉన్న యాప్‌‌‌‌ల పేరు కూడా జీ రామ్​జీ కిందికి మార్చనున్నారు. పనుల వివరాలు, కూలీల పేర్లు, మాస్టర్ల నమోదు, వేతనాల చెల్లింపులు, రికార్డులు అన్నీ జీ రామ్​జీ పథకం కిందే చేర్చనున్నారు. కాగా, ఈ పథకం కింద గ్రామీణ కార్మికులకు కల్పించే ఉపాధి దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. వేతనాల మధ్య ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే, వ్యవసాయ సీజన్‌‌‌‌లో మాత్రం పథకానికి 2 నెలలు విరామం ఇవ్వనున్నారు. జిల్లాల వారిగా కలెక్టర్లు ఈ పనులను పర్యవేక్షించనున్నారు.