- చంచల్‌గూడ జైలులో కుట్టుపని నుంచి ప్రీమియం ఫ్యాషన్ దాకా ట్రైనింగ్
- రేహాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా
- అప్‌స్కేల్ మార్కెట్ ద్వారా దేశవ్యాప్తంగా ఖైదీల ఫ్యాషన్ ఉత్పత్తులు
- హర్ రైట్స్ ఫౌండేషన్ సహకారంతో సరికొత్త ప్రయోగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర జైళ్లలోని మహిళా ఖైదీల నైపుణ్యాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తెచ్చేందుకు జైళ్లశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో లండన్‌లో నిర్వహించబోయే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ షోలో మన మహిళా ఖైదీలు రూపొందించిన ఆధునిక ఫ్యాషన్ డిజైన్లు, ఎంబ్రాయిడరీ దుస్తులను ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ మార్కెట్లకు అనుగుణంగా డిజైనర్ దుస్తులు, ప్రీమియం హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హై-ఎండ్ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో మహిళా ఖైదీలకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ మేరకు 'రేహాయ్' పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని హర్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు దివ్యారెడ్డి, బాబీ కందహారితో కలిసి తెలంగాణ జైళ్ల డీజీ డా. సౌమ్య మిశ్రా బుధవారం చంచల్‌గూడ మహిళా జైలులో అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీ డి. శ్రీనివాస్, మహిళా జైల్ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మీ శ్రీనాథ్, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.
మహిళా ఖైదీలకు గుర్తింపు తెస్తం: డీజీ సౌమ్యమిశ్రా
ఈ సందర్భంగా జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో గతంలోనే వంద రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి, మహిళా ఖైదీలకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ నేర్పించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ప్రారంభించిన ‘రేహాయ్’ కార్యక్రమంలో తయారయ్యే ప్రత్యేక ఉత్పత్తులను జైళ్ల శాఖ నిర్వహిస్తున్న అప్‌స్కేల్ మార్కెట్ ద్వారా మొదట దక్షిణ భారతదేశంలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రీమియం మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ఫ్యాషన్ మార్కెట్లలో మహిళా ఖైదీల ప్రతిభకు తగిన గుర్తింపు తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యమని ఆమె స్పష్టం చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల ఫినిషింగ్, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఖైదీలకు శిక్షణ ఇస్తామని ఆమె వెల్లడించారు.
మహిళా ఖైదీల నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, వారు రూపొందించిన డిజైనర్ దుస్తులతో లండన్‌లో ఫ్యాషన్ షో నిర్వహించేందుకు హర్ రైట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా మహిళా ఖైదీల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ నిష్ ఫ్యాషన్ మార్కెట్లలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న హర్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధి దివ్యా రెడ్డి.. ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అంతర్జాతీయ వేదికలపై పనిచేసిన విశేష అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆమె నేతృత్వంలోనే చంచల్‌గూడ జైలులోని మహిళా ఖైదీలకు అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెట్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
