హైదరాబాద్, వెలుగు: గురుకులాల టెండర్లపై ఆరోపణలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాలు స్వీకరిస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు వస్తే తాము చర్చకు సిద్దమని వారు స్పష్టం చేశారు. బాధ్యత గల మంత్రిగా, చట్ట సభకు ఎన్నికైన శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు వస్తే ఆము ప్రెస్ క్లబ్ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని పొన్నం ప్రకటించారు. ‘రాజకీయంగా కష్టపడి ఎదిగిన బలహీన వర్గాల బిడ్డలమైన నన్ను, లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ పై ఆరోపణల ద్వారా మనోధైర్యాన్ని దెబ్బతిస్తే ఆ వర్గాలు నిన్ను క్షమించవు’అని మంత్రి పొన్నం హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ పరిధి దాటి వ్యవహారం చేయొద్దన్నారు. పూర్తి స్థాయిలో అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వటానికి ముగ్గురు మంత్రులం రెడీగా ఉన్నామన్నారు.
గన్‌పార్క్ దగ్గర తేల్చుకుందాం రండి
గురుకుల టెండర్లలో అవినీతి నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. ఈ అంశంపై గురువారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గరకు కేటీఆర్, హరీశ్ రావు రావాలని.. తానూ ఆధారాలతో వస్తానని లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే తాను అవసరం లేదని, మా పార్టీ అధికార ప్రతినిధులే సమాధానం చెబుతారని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల టెండర్లపై నిత్యం హరీశ్, కేటీఆర్ నిరాదార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
