హైదరాబాద్, వెలుగు: సాయి పేరెంటరల్స్ అనుబంధ సంస్థ అయిన నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్, ఆస్ట్రేలియా ఫార్మసీ నెట్‌వర్క్‌లతో ఓటీసీ సప్లై కాంట్రాక్టును మరో ఏడున్నరేళ్ల పాటు పొడిగించింది. ఈ ఒప్పందం విలువ రూ. 1,300 కోట్లు. దీంతో ఏటా సుమారు రూ. 175 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రతి ఏడాది కొత్తగా 12 ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
నౌమెడ్ సంస్థ తయారీ, నాణ్యత నియంత్రణ, వేర్‌హౌసింగ్ , పంపిణీ వంటి పూర్తి బాధ్యతలను నిర్వహించనుంది. ఆస్ట్రేలియా వంటి అత్యంత కఠినమైన నియంత్రణలు ఉన్న మార్కెట్‌లో ఈ ఒప్పందం దక్కడం సంస్థ ప్రతిష్టను పెంచుతుందని సాయి పేరెంటరల్స్ ఎండీ అనిల్ కుమార్ కారుమూల పేర్కొన్నారు. దీనిని అవసరమైతే మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు.
