గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ గా నలుగురు ఇండియన్ అమెరికన్లు.. కార్నెగీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు

గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ గా నలుగురు ఇండియన్ అమెరికన్లు.. కార్నెగీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు

 

 

  • నికేష్ అరోరా, మహజరిన్ బనాజీ, సంజీవ్ చోప్రా, రేష్మా కేవల్రమానిలకు..
      అరుదైన గౌరవం

హ్యూస్టన్: న్యూయార్క్‌‌‌‌‌‌‌‌కు చెందిన కార్నెగీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్, గ్రేట్ అమెరికన్స్’ 2026 జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు లభించింది. సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ నికేష్ అరోరా, హార్వర్డ్ ప్రొఫెసర్ మహజరిన్ బనాజీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్  డాక్టర్ సంజీవ్ చోప్రా, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడెంట్, సీఈఓ రేష్మా కేవల్రమాని ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో, 21 దేశాల నుంచి వచ్చి అమెరికా పౌరసత్వం పొందిన 25 మందితో ఈ మేరకు 2026 జాబితాను ప్రకటించారు. అమెరికాకు వలస వచ్చిన వారు అందించిన సహకారాన్ని కొనియాడుతూ కార్నెగీ కార్పొరేషన్ ఏటా జులై 4వ తేదీన నిర్వహించే ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్, గ్రేట్ అమెరికన్స్’ కార్యక్రమంలో వీరిని సత్కరించనున్నారు. పాలో ఆల్టో నెట్‌‌‌‌‌‌‌‌వర్క్స్ చైర్మన్, సీఈఓ అయిన నికేష్ అరోరా ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో జన్మించారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జన్మించిన మహజరిన్ బనాజీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సోషల్ సైకాలజిస్ట్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. అంతర్లీన పక్షపాతం (ఇంప్లిసిట్ బయాస్)పై చేసిన అద్భుతమైన పరిశోధనలకు ఆమె ప్రసిద్ధి చెందారు. ఢిల్లీలో జన్మించిన చోప్రా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కాలేయ వ్యాధుల నిపుణుడు.

 ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఇక ముంబైలో జన్మించిన రేష్మా కేవల్రమాని వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారు. కాగా, గత ఏడాది, భారత సంతతికి చెందిన మానవ హక్కుల న్యాయవాది మంజూష పి. కులకర్ణి, 
యేల్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రియంవద నటరాజన్ ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.