ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానం’ అనే మాట న్యాయశాస్త్రంలో ప్రసిద్ధి చెందిన సూక్తి. కానీ అది కేవలం ఒక సూక్తి మాత్రమే కాదు. లక్షలాది మంది భారతీయుల జీవిత సత్యం. న్యాయస్థానం గడప తొక్కిన రోజు నుంచి తీర్పు వెలువడే రోజు వరకు ఎన్నో జీవితాలు మారిపోతాయి.
కొందరు తమ ఆస్తులను కోల్పోతారు. కొందరు తమ ఆరోగ్యాన్ని కోల్పోతారు. మరికొందరు తమ జీవితాన్నే కోల్పోతారు. చివరకు న్యాయం వచ్చినా, అది వారి చేతుల్లోకి చేరే సమయానికి దాని విలువ చాలావరకు కరిగిపోయి ఉంటుంది.
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా భారతదేశంలో కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉండటం కేవలం పరిపాలనా లోపం కాదు. అది సామాజిక న్యాయంపై పడిన గంభీరమైన మచ్చ. కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల గుట్టలు కేవలం ఫైళ్లు కావు. వాటి వెనుక వేలాది కుటుంబాల కన్నీళ్లు, విరిగిపోయిన కలలు, నిలిచిపోయిన జీవితాలు ఉన్నాయి.
కాలయాపన
ఒక చిన్న రైతు తన భూమి కోసం పోరాడుతున్నాడు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్లాడు. కేసు పదేళ్లు సాగింది. తర్వాత మరో అప్పీల్. మళ్లీ విచారణ. చివరకు తీర్పు వచ్చే సమయానికి అతని వయస్సు మీదపడింది. పొలం మాత్రం పాడుబడిపోయింది. గెలిచింది కేసు కావచ్చు. కానీ ఓడిపోయింది జీవితం. అప్పుడు ప్రజల మనసులో ఒక ప్రశ్న పుడుతుంది. న్యాయం బాధితుడి పక్షాన ఉందా? లేక కాలయాపన పక్షాన ఉందా?
పరిష్కారాలు లేవని కాదు
న్యాయమూర్తుల ఖాళీలు, కోర్టు భవనాల కొరత, సిబ్బంది లోపం, తరచూ వాయిదాలు, సంక్లిష్టమైన విధానాలు ఇవన్నీ కలిసి న్యాయవ్యవస్థపై భారాన్ని పెంచుతున్నాయి. డిజిటల్ యుగంలో క్షణాల్లో సమాచార మార్పిడి జరుగుతున్నప్పుడు, దశాబ్దాలపాటు కేసులు కొనసాగడం వ్యవస్థలోని లోతైన సమస్యలను సూచిస్తోంది. అయితే పరిష్కారాలు లేవని కాదు. న్యాయమూర్తుల ఖాళీలను అత్యవసరంగా భర్తీ చేయాలి.
దిగువ కోర్టులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ-కోర్టుల వ్యవస్థను మరింత విస్తరించాలి. చిన్న వివాదాలకు మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలి. విచారణల్లో అనవసర వాయిదాలను కఠినంగా నియంత్రించాలి.
న్యాయపోరాటం
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబం పరిహారం కోసం న్యాయపోరాటం చేస్తుంది. తండ్రిని కోల్పోయిన పిల్లలు చదువు మధ్యలో మానేస్తారు. తల్లి కుటుంబాన్ని నెట్టుకొస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతుంది. తీర్పు వచ్చే సమయానికి పిల్లలు పెద్దవాళ్లవుతారు. కానీ బాల్యం తిరిగిరాదు. అప్పుడు పరిహారం కేవలం ఒక చెక్కు మాత్రమే. న్యాయం కాదు. న్యాయవ్యవస్థలో ఆలస్యం వల్ల జరిగే నష్టం వ్యక్తిగత స్థాయిలోనే కాదు, సామాజిక స్థాయిలో కూడా తీవ్రంగా ఉంటుంది.
నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని సమాజం గమనించినప్పుడు చట్టం పట్ల గౌరవం తగ్గుతుంది. శిక్ష అనివార్యం కాదనే భావన నేరప్రవృత్తిని పెంచుతుంది. మరోవైపు బాధితులు వ్యవస్థపై నమ్మకం కోల్పోతారు. ఈ రెండూ కలిసి ప్రజాస్వామ్యపు పునాదులను బలహీనపరుస్తాయి. ప్రజాస్వామ్యంలో కోర్టులు ప్రజల చివరి ఆశ్రయం. కోర్టుల్లో సంవత్సరాల తరబడి కేసులు నత్తనడకన సాగితే ప్రజలకు మిగిలేది నిరాశ మాత్రమే.
- డి. హరిప్రసాద్–
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
