హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయ పార్టీల అజెండా మారాల్సిన అవసరముందని టీఆర్‌ఎస్ చీఫ్ కవిత అన్నారు. పెద్దవాళ్ల కోసం కాకుండా పేదవాళ్ల బతుకులు మారేలా పార్టీల ఆలోచన విధానం ఉండాలన్నారు. తెలంగాణ వస్తే అందరి జీవితాలు మారుతాయని భావించామని, కానీ, అలా జరగలేదన్నారు. బీఆర్‌ఎస్,కాంగ్రెస్, బీజేపీలు పేదల గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన ఆడబిడ్డగా వారి జీవితాల్లో మార్పు రావాలన్న సంకల్పంతోనే పార్టీ పెట్టానని చెప్పారు. పేదల జీవితాల్లో మార్పే అజెండాగా పెట్టుకున్నానని తెలిపారు.
తమ పార్టీ రాకతో రాష్ట్రంలో అన్ని పార్టీలు తమ అజెండా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండిలో టీఆర్‌ఎస్ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ మగ రాజకీయ నాయకులు చేసిన రాజకీయం చూశారని, ఇప్పుడు ఆడబిడ్డ చేసే రాజకీయాలు చూడాలని కోరారు. తనను ఆశీర్వాదిస్తే పేద, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పారు.
యువత ఉపాధి కోసం వారికి రూ. 2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు తమ ప్రభుత్వం రుణం అందిస్తుందన్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మళ్లీ సీఎం అవుతానని ఆయన చెప్తుండటం చూస్తుంటే నవ్వొస్తున్నదన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకుండా, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా, ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఎట్ల గెలుస్తారని ప్రశ్నించారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా గురువారం ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుని ఉద్యమకారులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
