30 రోజులు జైల్లో ఉంటే సీఎం, పీఎం పదవి ఔట్..పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో సవరణ బిల్లు

30 రోజులు జైల్లో ఉంటే సీఎం, పీఎం పదవి ఔట్..పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో సవరణ బిల్లు
  • 130వ రాజ్యాంగ సవరణ బిల్లు
  • ప్రస్తుతం బిల్లును పరిశీలిస్తున్న జేపీసీ
  • నివేదిక రాగానే ఆమోదింపజేయాలనే పట్టుదలతో కేంద్రం

న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక బిల్లును తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అదే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లు ప్రకారం.. ఏదైనా తీవ్ర నేరాల ఆరోపణలపై దేశ ప్రధానమంత్రి గాని, ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ అరెస్టయి.. 30 రోజులకు పైగా జైల్లో ఉంటే వారు ఆటోమేటిక్ గా తమ పదవులను కోల్పోతారు. 

ఈ బిల్లును 2025 వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రతిపక్షాల అభ్యంతరాలతో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపారు. 

కమిటీ తన నివేదికను సమర్పించగానే.. ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదింపజేయాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఇదొక రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల దీనికి లోక్‌‌‌‌‌‌‌‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ హాజరై.. ఓటు వేసే సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల (2/3) మంది మద్దతు కచ్చితంగా అవసరం. గతేడాది కంటే ప్రస్తుతం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో రాజకీయ సమీకరణాలు అధికార ఎన్డీయే కూటమికి కాస్త అనుకూలంగానే మారాయి. 

లోక్‌‌‌‌‌‌‌‌సభలో శివసేన(షిండే)కు చెందిన కొందరు ఎంపీల మద్దతుతో ఎన్డీయే బలం సుమారు 330 సీట్లకు పెరిగింది. అయినప్పటికీ, రాజ్యాంగ సవరణకు కావాల్సిన పూర్తి మెజారిటీకి ఇది ఇంకా కొద్దిగా తక్కువగానే ఉంది. అలాగే, 242 మంది సభ్యులున్న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఎన్డీయే బలం 141కి చేరింది. నామినేటెడ్, స్వతంత్ర సభ్యుల మద్దతు కలిపినా ఎన్డీయే బలం 151 స్థానాల వద్దే ఆగిపోయింది. ఇది సాధారణ మెజారిటీ కంటే ఎక్కువే అయినా, ప్రత్యేక మెజారిటీకి మరో 11 ఓట్లు అవసరం ఉంది.

ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఫోకస్

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా గతంలో అనేక కీలక బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన బిజూ జనతా దళ్ (బీజేడీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వంటి ప్రాంతీయ పార్టీల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ ఈ పార్టీలు గనుక బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ సులువుగా లభిస్తుంది.

 లేకుంటే ఈ చట్టాన్ని ఆమోదింపజేసుకోవడం మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.  బిల్లు గనుక చట్టంగా మారితే దేశంలో అత్యున్నత రాజకీయ పదవుల పదవీకాలానికి సంబంధించిన నిబంధనల్లో చరిత్రాత్మక మార్పులు వస్తాయి.