గాలె: శ్రీలంక–ఎ జట్టుతో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం ఇండియా–ఎ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. యువ ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. యంగ్ ప్లేయర్లకు అనుభవాన్ని అందించే టూర్ కావడంతో జట్టులోని ప్రతి సభ్యుడికి అవకాశం కల్పించాలని కోచ్ హృషికేష్ కనిత్కర్ భావిస్తున్నాడు.
ఈ క్రమంలో వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే న్యూజిలాండ్ పర్యటన, స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం టీమిండియా బ్యాకప్ పేసర్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల అఫ్గానిస్తాన్‌పై వన్డేల్లో ఆకట్టుకున్న గుర్నూర్ బ్రార్‌ను యష్ ఠాకూర్ ప్లేస్‌లో బరిలోకి దించనున్నారు.
అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లతో చెలరేగి, ఆ తర్వాత వార్విక్‌షైర్ తరఫున కౌంటీల్లో రాణించిన స్పిన్నర్ మానవ్ సుతార్ ఈ మ్యాచ్‌లో స్పిన్ విభాగాన్ని నడిపించనున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు విశ్రాంతిని ఇవ్వనున్నారు.
తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కని ఓపెనర్ అమన్ మోఖాడే, లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ కూడా రేసులో ఉన్నారు. మరోవైపు తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ సెంచరీ చేయలేకపోయిన ఆయుష్ పాండే స్థానంలో అమన్ మోఖాడేను పరిశీలించవచ్చు.
