Super Subbu Review: అడల్ట్ ఎడ్యుకేషన్ మాస్టర్‌గా సందీప్ కిషన్.. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు సిరీస్ ఎలా ఉందంటే?

Super Subbu Review: అడల్ట్ ఎడ్యుకేషన్ మాస్టర్‌గా సందీప్ కిషన్.. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు సిరీస్ ఎలా ఉందంటే?

హాస్యంతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకుల కోసం ‘సూపర్ సుబ్బు’ సిద్ధమైంది.. ఇవాళ గురువారం జూలై 2 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘డీజే టిల్లు’ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ-డ్రామాలో సందీప్ కిషన్ ఆసక్తికరమైన రోల్ చేశాడు.

అలాగే, ఈ సిరీస్‌లో గ్లామర్ అండ్ యాక్టింగ్ డోస్ పెంచడానికి బాలీవుడ్ ‘లిటిల్ థింగ్స్’ ఫేమ్ మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఇందులో ఒక క్రేజీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఎలాగైనా యాక్టర్ అవ్వాలని కలలుకనే క్యారెక్టర్‌లో కనిపించింది. 

వీరితో పాటు కామెడీ కింగ్ బ్రహ్మానందం, వర్సటైల్ యాక్టర్ మురళీ శర్మ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, గెటప్ శ్రీను, జీవన్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి ఈ సిరీస్‌ను నిర్మించారు. హాస్యం, భావోద్వేగాలతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుందని మేకర్స్ తెలియజేశారు.

ఈ చిత్రం సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే నిజాయితీ గల యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను కల్పిత గ్రామమైన మాకీపూర్‌లో ప్రజా అవగాహన అధికారి ఉద్యోగాన్ని స్వీకరిస్తాడు. గ్రామస్థులకు అవగాహన కల్పించడం అతని ప్రధాన బాధ్యత.

అయితే అతని లక్ష్యం ఎంత సులభంగా కనిపించినా, గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత ఏదీ అనుకున్నట్లుగా జరగదు. అలా చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో, ఫుల్ లెంగ్త్ హ్యూమర్ అండ్ ఎమోషన్స్‌తో సాగే ఈ అడల్ట్ కామెడీ ఫుల్ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం. ఇకపోతే, నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఫస్ట్ తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ కావడం విశేషం. 

కథ ఏంటంటే?

‘‘ఒక అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యంగా అనిపించే ఒక ఉద్యోగం..’’  ఇదే 'సూపర్ సుబ్బు' కథకు ప్రధాన బలం.

సుబ్రహ్మణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) అనే నిజాయితీ గల యువకుడికి ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని 'మాకిపూర్' అనే వింత గ్రామంలో ఉద్యోగం వస్తుంది. తన తండ్రి టీచరైన కుకటేశ్వరరావు (మురళీ శర్మ) ముందు తన ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలని భావించిన సుబ్బు, కొత్త ఉత్సాహంతో గ్రామంలో అడుగుపెడతాడు. అయితే అక్కడ అతనికి ఎదురయ్యే పరిస్థితులు అతను ఊహించిన వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

ఆ గ్రామ ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో, సుబ్బు వారికి 'అడల్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్'గా పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు ప్రేమ వ్యవహారాలు, ఇంకోవైపు గ్రామస్థుల అపార్థాలు, పుకార్లు అతని జీవితాన్ని మరింత క్లిష్టంగా మారుస్తాయి.

ఒక సమస్యను పరిష్కరించాలనుకుంటే మరో ఐదు సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రతి చిన్న విషయం పెద్ద చర్చగా మారడం, గ్రామమంతా పుకార్లు వ్యాపించడం, సుబ్బు ప్రయత్నాలకు అడ్డంకులుగా నిలుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్న తన లక్ష్యాన్ని సుబ్బు ఎంతవరకు నెరవేర్చగలిగాడు? అతని ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే:

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ, ఎమోషన్స్, సోషల్ మెసేజ్‌లను మిళితం చేస్తూ రూపొందిన 'సూపర్ సుబ్బు' ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే ప్రయత్నం చేసింది. సాధారణంగా పెద్దగా పట్టించుకోని అడల్ట్ ఎడ్యుకేషన్ వంటి అంశాన్ని హాస్యభరితంగా చూపించడంలో డైరెక్టర్ మల్లిక్ రామ్ మంచి ప్రయత్నం చేశారు.

సుబ్బు పాత్రలో సందీప్ కిషన్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకత్వం, బాధ్యత, గందరగోళం వంటి భావోద్వేగాలను సమానంగా పండించి ఆకట్టుకున్నాడు. మిథిలా పాల్కర్ తన పాత్రకు గ్లామర్‌తో పాటు ఎనర్జీని తీసుకొచ్చింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమె నటన యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.బ్రహ్మానందం, గెటప్ శ్రీను, సంపూర్ణేష్ బాబు వంటి నటుల కామెడీ ట్రాక్‌లు అనేక చోట్ల మంచి వినోదాన్ని పంచాయి. మురళీ శర్మ తన అనుభవంతో కథకు బలాన్ని చేకూర్చారు.

ముఖ్యంగా గ్రామస్థుల అమాయకత్వం చుట్టూ తిరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తూనే కొన్ని సందర్భాల్లో సమాజంలోని వాస్తవాలను కూడా గుర్తు చేస్తాయి. ముఖ్యంగా చిన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ తో, ఫుల్ లెంగ్త్ హాస్యం, భావోద్వేగాలు మరియు వినోదంతో సాగిపోయే ఈ అడల్ట్ కామెడీ-డ్రామా ప్రేక్షకులకు నవ్వులతో పాటు ఆలోచింపజేసే అంశాలను కూడా అందిస్తుంది.