- మృతుల్లో ఐదుగురు సజీవదహనం.. 22 మందికి గాయాలు
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని దౌసా జిల్లాకు సమీపంలో ఉన్న ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టింది. దాంతో రెండు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
యాక్సిడెంట్ జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్, క్లీనర్ వాహనం ఆపి కిందకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్యాసింజర్లంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాద ధాటికి బస్సులో పై సీట్ల(అప్పర్ బెర్త్)లో పడుకున్న వారు ఒక్కసారిగా కింద పడిపోయారు.
ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం కాగా, మిగతా ముగ్గురు తీవ్ర గాయాల వల్ల మరణించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పివేసి బస్సులో చిక్కుకున్న బాధితులను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం దౌసా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.
కాగా, ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది చాలా ఆలస్యంగా వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగి మంటలు వ్యాపించిన గంట తర్వాత గానీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదని చెప్పారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే మరికొన్ని ప్రాణాలు మిగిలేవని వాపోతున్నారు.
