అయోధ్య: రామ మందిర విరాళాల చోరీ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, విదేశీ కరెన్సీ విలువ రూ.1 కోటి దాటినట్లు తెలిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి విచారించింది.
వారి బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, స్థిర, చరాస్తులపై ఆరా తీస్తోంది. నిందితుల ఇళ్లలో చేసిన తనిఖీల్లో వారి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోదాల్లో విలువైన బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు సమాచారం. నిందితుల్లో కొందరు చోరీ చేసిన డబ్బుతో ఇళ్లు, వ్యవసాయ భూములు, వాహనాలు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఇద్దరే పెద్ద దొంగలు
అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా అనే ఇద్దరు బావ–బామ్మర్దులు అత్యధికంగా నగదును దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. వీరికి సంబంధించి అరడజనుకు పైగా ఆస్తులను, రూ. 30 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు అవినాష్ శుక్లా సోదరుడు నిర్వహించే యోగా కేంద్రంపై దాడి చేయగా.. 4 పెట్టెల నిండా నగదు లభ్యమైంది.
ఇందులో ఒక పెట్టెపై ‘రామరాజ్య కోష్’ అని రాసి ఉండటం గమనార్హం. అవినాష్ నుంచి రూ. 20.39 లక్షలు, 1,121 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మనీష్ కుమార్ యాదవ్ నుంచి రూ. 20 లక్షలు, కరుణేష్ పాండే రూ. 18.07 లక్షలు, రాంశంకర్ మిశ్రా రూ. 7.32 లక్షలు, తిన్నూ యాదవ్ రూ. లక్ష, మరో నిందితుడి నుంచి రూ. 6.93 లక్షలు రికవరీ చేశారు.
మహా కుంభమేళా సమయంలోనే
గతేడాది జరిగిన మహా కుంభమేళా సమయంలోనే విరాళాల నుంచి అత్యధిక భాగం దోపిడీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ పెరిగి భారీగా కానుకలు, విరాళాలు రావడాన్ని అదునుగా చూసుకుని నిందితులంతా కుమ్మక్కై దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
