సామినేని హత్య కుట్రదారులెవరో అందరికీ తెలుసు : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బృందా కారత్

సామినేని హత్య కుట్రదారులెవరో అందరికీ తెలుసు : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బృందా కారత్
  •     నిందితులను రాజకీయ నాయకులు, అధికారులు కాపాడుతున్నరు
  •     కుట్రదారులను అరెస్ట్ చేసే వరకు పోరాటం : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బృందా కారత్

చింతకాని, వెలుగు : 'సామినేని రామారావు హత్య వెనుక ఎవరున్నారో, ఎవరు చేయించారో ప్రజలందరికీ తెలుసు, రామారావు నాయకత్వంలో సాగుతున్న ప్రజా ఉద్యమాలు, ఆయనకు వస్తున్న ఆదరణ తట్టకోలేక హత్య చేశారు' అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బృందా కారత్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో బుధవారం జరిగిన సామినేని రామారావు విగ్రహావిష్కరణ, బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రామారావు హత్య జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదన్నారు. 

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులకు అధికార యంత్రాంగం, అధికార పార్టీకి చెందిన నాయకుల అండగా ఉన్నారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు సీపీఎం తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదలు, దళితులు, కార్మికులు, శ్రామికుల హక్కుల కోసం జీవితాంతం ఎర్రజెండా కింద పోరాడిన నాయకుడు సామినేని రామారావు అని కొనియాడారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకే ఆయనను హత్య చేశారని ఆరోపించారు. 

తన సొంత భూమిని దళితులకు దానం చేసిన వ్యక్తి రామారావు అని.. అలాంటి ప్రజానాయకుడిని హత్య చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. దేశంలో పేదలు, దళితులు, ఆదివాసీలు, విద్యార్థులు, కార్మికుల హక్కులను హరించి వేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కార్యదర్శులు నున్న నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జాతీయ నాయకులు సాయిబాబా, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్, కల్యాణం వెంటేశ్వర్లు, మచ్చర్ల భారతి, నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, సోమయ్య, సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మధుపల్లి గోపాలరావు, చింతల చెరువు కోటేశ్వరరావు, బండి పద్మ, శీలం నరసింహారావు పాల్గొన్నారు.