ప్రపంచ వ్యవస్థే కుప్పకూలుతుంది.. సింధూ జలాల ఒప్పందం అంశంపై పాకిస్తాన్ ఆందోళన

ప్రపంచ వ్యవస్థే కుప్పకూలుతుంది.. సింధూ జలాల ఒప్పందం అంశంపై పాకిస్తాన్ ఆందోళన

ఇస్లామాబాద్: తీవ్ర ఎండలు, ఎల్‌‌‌‌‌‌‌‌నినోతో ముంచుకొస్తున్న నీటి ఎద్దడి నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. భారత్ ‘సింధూ జలాల ఒప్పందాన్ని’ (ఐడబ్ల్యూటీ) తాత్కాలికంగా నిలిపివేయడంతో బెంబేలెత్తిపోతున్న ఆ దేశం.. తాజాగా ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించి ప్రపంచ దేశాల మద్దతు కోసం పాకులాడింది. 

ఈ చరిత్రాత్మక ఒప్పందాన్ని కాపాడుకోలేకపోతే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లిఖితపూర్వకంగా ఏర్పాటైన ‘ప్రపంచ వ్యవస్థే’ (వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కుప్పకూలుతుందని పాక్ మంత్రులు హెచ్చరించారు. 2025 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై శిక్షాత్మక చర్యల్లో భాగంగా భారత్ ఈ నీటి భాగస్వామ్య ఒప్పందాన్ని పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్ నినో’ వల్ల ఈ ఏడాది వేసవి కాలం మరింత భీకరంగా మారే అవకాశం ఉండటంతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు నీటి గండం పొంచి ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

నీటిని ఆయుధంగా మార్చొద్దు: ఇషాక్ దార్

‘సింధూ జలాల ఒప్పందం: ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కీలక సాధనం’ అనే థీమ్‌‌‌‌‌‌‌‌తో ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సదస్సులో పాక్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ మాట్లాడారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసే హక్కు ఏ దేశానికీ లేదని, భారత్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. 

‘‘భాగస్వామ్య జలాలను ఎప్పుడూ ఆయుధంగా మార్చకూడదు. ఒప్పందంలో ఉపసంహరణ నిబంధన లేనప్పుడు ఏ పక్షమూ ఏకపక్షంగా బాధ్యతల నుంచి తప్పుకోలేదు” అని అన్నారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన నీటిని తగ్గించడానికి లేదా నిలిపివేయడానికి ప్రయత్నిస్తే, దానిని తమపై ‘యుద్ధ ప్రకటన’గానే పరిగణిస్తామని హెచ్చరించారు.