- గ్రామ కమిటీలు బ్లాక్మెయిల్చేయడం తగదు
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ స్కూళ్లను రక్షించి వాటి మనుగడకు సహకరించాలని తెలంగాణ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ప్రైవేట్ స్కూల్ బస్సులను గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
లక్డీకాపూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడ్జెట్ స్కూళ్ల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులకు తమ పిల్లలను ఏ స్కూల్‌లో చదివించాలో నిర్ణయించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపిస్తే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని గ్రామ కమిటీ సభ్యులు బెదిరించడం సరైంది కాదన్నారు. అలాగే గుర్తింపు లేని కొన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు స్కూళ్లలోకి అక్రమంగా ప్రవేశించి అనుమతులు లేవంటూ భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
