తమిళ రాజకీయాల్లో కలకలం: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. రూ. 35 కోట్లిచ్చి 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాకు ప్లాన్‌‌‌‌‌‌‌‌

తమిళ రాజకీయాల్లో కలకలం: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. రూ. 35 కోట్లిచ్చి 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాకు ప్లాన్‌‌‌‌‌‌‌‌
  • టీవీకే ఎమ్మెల్యే  ఇళయరాజా ఫిర్యాదుతో దర్యాప్తు
  • నలుగురిపై కేసు నమోదు.. ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌
  • డీఎంకే నేత సెంథిల్‌‌‌‌‌‌‌‌ బాలాజీ లింక్‌‌‌‌‌‌‌‌పై ఎంక్వైరీ
  • ఖండించిన డీఎంకే.. ఆధారాలు చూపాలని సవాల్‌‌‌‌‌‌‌‌

చెన్నై: తమిళనాడులో సీఎం విజయ్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టీవీకే ఎమ్మెల్యే ఎన్‌‌‌‌‌‌‌‌.ఇళయరాజా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. తనకు రూ.35 కోట్ల లంచం ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేసి స్పీకర్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. 

ఈ కేసులో డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌‌‌‌‌‌‌‌ బాలాజీ అనుచరుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలను డీఎంకే పూర్తిగా ఖండించింది. తమిళనాడు ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ వర్గాల సమాచారం ప్రకారం, ఒకేసారి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని మైనారిటీలోకి నెట్టాలన్న ప్రణాళిక ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

 ఇళయరాజా ఫిర్యాదు మేరకు తొలుత చెన్నైలో ఐపీడీఎస్‌‌‌‌‌‌‌‌ (ఐపీడీఎస్) కన్సల్టెన్సీకి చెందిన తిరునావుక్కరసును అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. అతడిని విచారించిన తర్వాత కరూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పలు మీడియా 
కథనాలు తెలిపాయి. నిందితులకు సెంథిల్‌‌‌‌‌‌‌‌ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌కు సన్నిహితులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

కీలకంగా కరూర్ గ్యాంగ్..

ఇక టీవీకే మంత్రి సీటీ నిర్మల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ డీఎంకేపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంథిల్‌‌‌‌‌‌‌‌ బాలాజీతో పాటు ‘‘కరూర్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌’’ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిందని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఆఫర్లు ఇచ్చారని, డీఎంకేతో పాటు ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా ప్రభుత్వాన్ని అస్థిరం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయ్‌‌‌‌‌‌‌‌, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌‌‌‌‌‌‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌‌‌‌‌‌‌‌ పేర్లను కూడా ఈ వివాదంలో ప్రస్తావించారు.

ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి

టీవీకే సర్కారును కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు రాజకీయ నాటకమని డీఎంకే అభివర్ణించింది. దర్యాప్తు పూర్తికాకముందే వివరాలను బయటకు చెప్పి ప్రజల్లో సానుభూతి పొందేందుకు టీవీకే ప్రయత్నించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏ.శరవణన్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు.

 నిజంగా ఆధారాలు ఉంటే సెంథిల్‌‌‌‌‌‌‌‌ బాలాజీని వెంటనే అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్రభుత్వానికి సవాల్‌‌‌‌‌‌‌‌ విసిరారు. విజయ్‌‌‌‌‌‌‌‌, సెంథిల్‌‌‌‌‌‌‌‌ బాలాజీ మధ్య ఇప్పటికే రాజకీయ విభేదాలు ఉన్నాయి. కరూర్‌‌‌‌‌‌‌‌లో విజయ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల సభలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత కూడా ఇద్దరి మధ్య రాజకీయ ఆరోపణలు, విమర్శలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.