అధిక ఉష్ణోగ్రతలు.. ఐరోపాలోనే అనూహ్య మరణాలెందుకు?

అధిక ఉష్ణోగ్రతలు.. ఐరోపాలోనే అనూహ్య మరణాలెందుకు?

ఐరోపా దేశాలలో  వేడి పెరిగిన సందర్భంలో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉష్ణోగ్రతలను దానితో  పోల్చడం మొదలయ్యింది.  దీనిపై చర్చ మంచిదే.  అనేక విషయాలలో ఈ పరిస్థితిని పోలిస్తే మనకు కావాల్సింది ఏమిటి?,  పోగొట్టుకునేది ఏమిటి? అనేది తెలుస్తుంది.  భారతీయులు అధికవేడిని తట్టుకునే శక్తిగా,  ఐరోపావాసులను అర్భకులుగా  కొంతమంది చిత్రీకరిస్తున్నారు. అయితే, లెక్కల సేకరణలోనే మతలబులు ఉన్నాయి.  ఇందులో అనేక కోణాలు ఉన్నాయి. 

భారతీయ  మీడియాలో ఈ సంవత్సరం  యూరప్ ఎదుర్కొన్న తీవ్రతను,  దానిని వారు ఎదుర్కొంటున్న తీరును కొంత తక్కువగా చేసి చూపుతున్నారు.  యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  2026లో  వేసవికాలం  నిజంగానే అత్యంత తీవ్రమైనది.  ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  జూన్ 24న జాతీయ సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సీ. అయితే  కొన్ని పట్టణాలలో ఉష్ణోగ్రతలు 42-43 సీకి  చేరాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ  నివేదిక ప్రకారం జూన్ 21 నుంచి  ఐరోపా ఖండం అంతటా 1,300కు పైగా  అదనపు మరణాలు సంభవించాయి. దీనివల్ల 15 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 

ఒక్క  ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  వేడిమి కారణంగా సుమారు 1,000 అదనపు మరణాలు నమోదయ్యాయి.   ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58 రెడ్ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జారీ అయ్యాయి. నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలలో  ముందుజాగ్రత్త చర్యలు అనేకం తీసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు ప్రభావాలు చూపుతాయనే విషయంలో అనుమానం ఏమీ లేదు.  

మొదటి నుంచి  కూడా వేడి వాతావరణంలో జీవించే అలవాటు భారతీయులకు ఉండడం ఒక బలం. వేడి గురించి మాట్లాడేటప్పుడు  కేవలం ఉష్ణోగ్రత స్థాయి మాత్రమే చూస్తే  పరిస్థితి అర్థంకాదు. తేమతో కూడిన గాలి,  వేడి కూడా మరణాలకు, తీవ్ర అనారోగ్య పరిణామాలకు దారి తీస్తుంది.  పొడిగా ఉండే వేడిని తట్టుకునే శక్తి  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండవచ్చు.  

వరల్డ్  వెదర్ అట్రిబ్యూషన్ అనే సంస్థ 30 యూరోపియన్  దేశాలలోని 854 నగరాలను  పరిశీలించి, వాటిలో 45% నగరాలు వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్  (డబ్ల్యూబీజీటీ) విషయంలో తమ సర్వకాలిక రికార్డును బద్దలుకొట్టాయని ఉన్నాయని కనుగొంది. డబ్ల్యూబీజీటీ  అనేది వేడి, తేమ, సూర్యరశ్మి, గాలిని కలిపి, మానవ శరీరం ఎంత సమర్థవంతంగా తనను తాను చల్లబరుచుకోగలదో కొలిచే ఒక కొలమానం. 

ఉష్ణోగ్రతల  మధ్య  వ్యత్యాసం

ఇప్పుడు  ఐరోపా,  భారత్  ఒకే తీరు ప్రమాదకర పరిస్థితిని  చేరుకుంటున్నాయి. పెరుగుతున్న వేడి  వాతా వరణానికి  అలవాటుపడటం  తప్పదు.  ఇక వైరల్ అవుతున్న... ఉబ్బిపోయిన తారు రోడ్లు,  వంగిపోయిన ట్రాఫిక్ సిగ్నల్స్,  ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై  గుడ్లతో  ఆమ్లెట్  వేసుకోవడంవంటి వాటికి  సంబంధించి  వాస్తవికమైన  సమాధానం అవసరం ఉన్నది.  

యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాలా ప్రాంతాలలో  తారును,  భారతీయ రోడ్డు  ఉపరితల  ప్రమాణాల కంటే తక్కువ,  చల్లని ఉష్ణోగ్రతల కోసం రూపొందిస్తారు.  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45–-50 డిగ్రీల సీ వరకు ఉంటాయి.  కాబట్టి దానికనుగుణంగా భారతీయ  ప్రమాణాలు ఉంటాయి. యూరోపియన్  తారు దాని డిజైన్ పరిమితిని దాటినప్పుడు, అది మెత్తబడటం, గుంతలు పడటం స్పష్టంగా కనిపిస్తుంది.  గాలి ఉష్ణోగ్రత,  ఉపరితల ఉష్ణోగ్రత  మధ్య ఉన్న  వ్యత్యాసం బట్టి  రోడ్లు కరగడం  వంటి  పరిణామాలు ఉంటాయి.  

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ వేడి

గత 30 ఏండ్లలో  ముఖ్యంగా  సరళీకరణ తర్వాత  ‘అభివృద్ధి’ బాట పట్టాక గాజు కర్టెన్-వాల్ టవర్లు,  నీడలేని కాంక్రీట్ బ్లాకులు కడుతున్నారు.  ఈ శైలి ఐరోపా, ఉత్తర అమెరికాలోని శీతల వాతావరణ  నగరాల కోసం అభివృద్ధి చేయడమైనది. అక్కడ సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని బంధించి, శీతాకాలపు విద్యుత్ బిల్లులను తగ్గించడం కోసమే గాజు నిర్మాణాలు చేస్తారు.

 వాటిని భారతీయ నగరాల్లోకి తీసుకురావడం అంటే ఇప్పటికే అధిక వేడి ఉన్న వాతావరణంలోకి  వేడిని బంధించే తర్కాన్ని దిగుమతి చేసుకోవడమే.  తోటోడు  తొడ కోసుకుంటే,  నేను మెడ కోసుకుంటా అన్న చందంగా మన నిర్మాణాలు తయారయ్యాయి.     భారతీయ నగరాలపై జరిపిన ఒక విశ్లేషణలో పట్టణ ప్రాంతాలు చుట్టుపక్కల  గ్రామీణ భూముల కంటే  2-–10  డిగ్రీల  ఎక్కువ వేడిగా ఉంటున్నాయని కనుగొన్నారు.  దీనికి ప్రధాన కారణం, ముదురు రంగు రోడ్డు ఉపరితలాలు,  కాంక్రీటు పైకప్పులు,  గాజు అంతస్తులు వంటివి సూర్యాస్తమయం తర్వాత చాలాసేపటి వరకు నిల్వ ఉన్న వేడిని తిరిగి  బహిరంగ ప్రదేశంలోకి ప్రసరింపజేయడమే. ఈ విధమైన నిర్మాణాలు ఇప్పుడు మనకు శాపంగా పరిణమించాయి. 

డేటాలో భారీ వ్యత్యాసాలు 

అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కొద్ది రోజులకే సుమారు 1,000 అదనపు మరణాలను ఐరోపాలో  ప్రకటించడానికి ఆస్కారం అక్కడ అవలంబిస్తున్న ‘యూరోమోమో’ అనే నమూనా వల్లనే.  ఇటీవలి ఒక మోడలింగ్ అధ్యయనం అంచనా ప్రకారం  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకే తీవ్రమైన వేడి రోజు దేశవ్యాప్తంగా సుమారు 3,400 అదనపు మరణాలకు కారణం కాగా,  5 రోజుల అధిక ఉష్ణోగ్రతల వల్ల దాదాపు 30,000 మరణాలు సంభవించి ఉండవచ్చు. 

 ఈ సంఖ్యలు  అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువ.  అయినప్పటికీ  ఇవి 2008-–2019 ప్రాతిపదికపై  నిర్మించిన నమూనా అంచనాలు మాత్రమేనని,  ఈ సంవత్సరం సంభవించిన సంఘటనల వల్ల ధృవీకరించిన మరణాలు కావని అధ్యయనం చేసినవారు హెచ్చరిస్తున్నారు.  

పది నగరాలలో సేకరించిన సమాచారానికి అధిక ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్న వందలాది జిల్లాలకు ఈ పద్ధతి ఉపయోగించడం మంచిది కాదు అని విమర్శకులు అంటున్నారు.  జాతీయ నేరాల రికార్డుల బ్యూరో (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ)  గణాంకాలకు,  వ్యక్తిగత రాష్ట్రాల విపత్తు నిర్వహణ డేటాకు మధ్య పోలికలు  భారీ వ్యత్యాసాలను చూపుతున్నాయి.  

తెలంగాణలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ  లెక్కల ప్రకారం వందకు పైగా వడదెబ్బ మరణాలు సంభవించగా,  అదే సంవత్సరానికి రాష్ట్ర హీట్ యాక్షన్ ప్లాన్ లెక్కల ప్రకారం కేవలం పది మాత్రమే ఉన్నాయి. వేడి వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల,  వడదెబ్బ వల్ల కలిగే మరణాలను మనం పూర్తిగా అంచనా వేయలేకపోతున్నాం.  

సమాచార సేకరణలో లోపాలు

అత్యధికంగా  వడదెబ్బకు గురయ్యేవారు కార్మికులు, అనేక రకాల చిరుద్యోగులు, వీధి వ్యాపారులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు.   వడదెబ్బ మరణాలపై  అధికారికంగా విచారణ  జరగడానికి లేదా వారికి నష్టపరిహారం అందడానికి అవకాశాలు చాలా తక్కువ.  ఐరోపా దేశంలో  వడదెబ్బ కారణంగా సంభవిస్తున్న మరణాలు మన దేశంతో పోల్చి చూసేవాళ్లు మన సమాచార సేకరణ,  వ్యవస్థలో ఉన్న లోపాలను పరిగణనలోకి తీసుకోవాలి.  

అధిక ఉష్ణోగ్రతల విషయంలో భారత్, -యూరప్ మధ్య  చేస్తున్న పోలికలో  అతి తక్కువ దృష్టిని ఆకర్షించే అంశం ఏమిటంటే.. ప్రభుత్వాల ప్రతిస్పందన.  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కేవలం ఒక వారంలోనే 'మెటియో -ఫ్రాన్స్' సంస్థ, సగానికి పైగా జనాభాను కవర్ చేస్తూ  58 డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల (స్థానిక పాలనా వ్యవస్థ) వరకు అత్యధిక రెడ్ అలర్ట్ కింద ఉంచింది.  జాతీయ ప్రజారోగ్య సంస్థ, 'సాంటే పబ్లిక్ ఫ్రాన్స్', ప్రావిన్స్ స్థాయి మరణాల అంచనాలతో ఎప్పటికప్పుడు సమాచారం  ప్రచురిస్తూ వచ్చింది. 

 ఫ్రాన్స్ దేశంలో ప్రభుత్వ  ప్రతిస్పందన  వేగంగా,  నిర్దిష్టంగా ఉన్నది. సుమారు 2,000 పాఠశాలలు మూసివేశారు. పట్టాలు వంగిపోతాయని  జాతీయ  రైల్వే రైళ్లను  రద్దు చేసి  వేగ పరిమితులను విధించింది,  ఈఫిల్ టవర్, లూవ్రే వంటి ప్రసిద్ధ ప్రదేశాల పనివేళలను తగ్గించారు. స్పెయిన్, ఇటలీలో కూడా నిర్దిష్ట చర్యలు ప్రకటించారు. 

అధిక ఉష్ణోగ్రతలపై  సత్వరం స్పందించాలి

కేంద్ర  ప్రభుత్వపు వడగాలుల  కార్యాచరణ ప్రణాళిక  ఉష్ణోగ్రతలు  వరుసగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సీ కంటే ఎక్కువగా ఉన్న తర్వాతే  అమలుచేసినట్లు  నివేదికలు చెబుతున్నాయి.  ఇది  అత్యవసర  పరిస్థితికి  చాలాకాలం తర్వాత జరిగింది.   సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా 500 పైగా  వడగాలుల కార్యాచరణ ప్రణాళికలు తయారయ్యాయి.   కానీ వాటిని రాష్ట్ర,  పురపాలక స్థాయిలో మాత్రమే రూపొందించి, అమలు చేస్తారు.  

గ్రామాల గురించి ఎక్కడా పట్టింపు లేదు.   ప్రకృతి వైపరీత్యాలు ఏది వచ్చినా, అధిక ఉష్ణోగ్రతలతో సహా, ప్రభుత్వ స్పందన ఎప్పుడూ తగినంతగా లేదు.  ఏ ప్రభుత్వ యంత్రాంగం అధిక వేడి వాతావరణాన్ని  నిజ-సమయ  చర్యలతో అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తున్నది అని కూడా గమనించాలి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఫ్రాన్స్ భారతదేశం కంటే వేగంగా, మరింత పారదర్శకంగా ముందుకు సాగుతోంది.  భారత్​లోనూ అదేస్థాయిలో సత్వరం  స్పందించాలి.

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.