ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం...సాగు చేస్తే వేస్తే రైతు భరోసా కట్ చేసేలా నిర్ణయం

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయిపై  ఉక్కుపాదం...సాగు చేస్తే వేస్తే రైతు భరోసా కట్ చేసేలా నిర్ణయం
  •     కుమ్రం భీంఆసిఫాబాద్ జిల్లాలో 35 మంది రైతులపై చర్యలు
  •     వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెరమెరి, సిర్పూర్ యూ, తిర్యాణి, వాంకిడి మండలాల్లోని  35 మంది రైతులకు సంబంధించిన 77.33 ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని నిలిపివేసినట్లు కలెక్టర్ కె.హరిత వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

గంజాయి కట్టడికి కఠిన నిర్ణయం

గంజాయి సాగు కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జిల్లాస్థాయి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నియంత్రణ కమిటీ సమావేశంలో కలెక్టర్.. జిల్లాను డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో గంజాయి సాగు ఎక్కువగా జరిగే అవకాశమున్న అడవి ప్రాంతాలు, సరిహద్దు గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. 

పండించినా, అమ్మినా, సరఫరా చేసినా దోషులే

గంజాయి సాగు, రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చే వాహనాలు, బస్సుల తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు. మెడికల్ షాపులు, బెల్ట్ షాపులు, కల్లు డిపోలు, విద్యాసంస్థల సమీపంలోని పాన్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ బారిన పడకుండా గ్రామాలు, స్కూళ్లు, కాలేజీల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమనే సంకేతాన్ని రైతు భరోసా నిలిపివేత ద్వారా ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.

పక్క జిల్లాలు, రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్

జిల్లా సరిహద్దుల్లోని మహరాష్ట్ర తో పాటు పక్క జిల్లాల్లో గంజాయికి ఫుల్ డిమాండ్ ఉంది. మహారాష్ట్ర పక్కనే ఉండటం, అక్కడ డిమాండ్ విపరీతంగా ఉండటంతో స్మగ్లర్లకు కలిసిస్తోంది. రోడ్డు మార్గాలతోపాటు అడవి మార్గంలోనూ గంజాయి ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. గంజాయి కోత దశకు రాగానే పంటను కోసి కొన్ని రోజులు ఎండబెట్టి సంచుల్లో నింపి బైకులు, కారు ,ఆటోల్లో ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు. ఇలా ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తుండటం పోలీసులు తలనొప్పిగా మారింది. 

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు దూరంగా  ఉంటేనే భవిష్యత్

ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దు.అసలు  అలవాటు చేసుకోవద్దు. డ్రగ్స్ అనేవి వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరులో ఇబ్బందులు ఎదురవుతాయ్ .గంజాయి స్మగ్లింగ్, సాగు చేసిన, విక్రయించిన కఠినంగా వ్యవహరిస్తం. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు ,అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసినట్లయితే వెంటనే 1908 డ్రగ్స్ కంట్రోల్ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్, 112 ఎమర్జెన్సీ నంబర్ , సమీప పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలి.  సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
-నితికా పంత్, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రవాణాపై కఠిన చర్యలు

జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడం కోసం అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నాం. జిల్లాలోని ప్రతి మెడికల్ షాపులను తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో ప్రజలకు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. జిల్లాలో గంజాయి సాగు చేసిన 35 మందిని గుర్తించి వారికి రైతు భరోసా నిలిపివేశాం.  
-కె.హరిత, కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్