ఫీజు నియంత్రణ చట్టం తేవాలి.. ఇష్టారాజ్యంగా పెంచుతున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు

ఫీజు నియంత్రణ చట్టం తేవాలి.. ఇష్టారాజ్యంగా పెంచుతున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు

తెలంగాణ రాష్ట్రంలో 2026 -– 27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలలు అదేవిధంగా జూనియర్  కళాశాలలు,  డిగ్రీ కళాశాలలు  ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఈ భారం తీవ్రమవుతుంది. 

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం, ఆర్థిక ఇబ్బందుల్లో పడడం సాధారణమైపోయింది. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2017లో నాటి  ప్రభుత్వం  ఫీజులపై  నియంత్రణ కోసం  ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. 

ప్రైవేట్ విద్యా సంస్థలు ఏడాదికి పది శాతం ఫీజులు మాత్రమే పెంచుకోవడం వంటి సిఫార్సులను ఈ కమిటీ చేసింది. అయితే ఆ నివేదిక అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని ప్రకటించినా నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

ప్రస్తుతం తెలంగాణలో  విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సమగ్రంగా పాఠశాలలు, అన్ని విద్యాసంస్థలకు వర్తించే ప్రత్యేక ఫీజు నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో అనేక ప్రైవేట్ సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే 
విమర్శలు ఉన్నాయి. 

ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఇప్పటికే ఉన్న చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వం ఫీజులను నియంత్రించే అధికారం కలిగి ఉంది.  ఇటీవలి కాలంలో ప్రైవేట్ పాఠశాలలు 30 నుంచి 50 శాతం వరకు ఫీజులను పెంచినట్లు తల్లిదండ్రులు, అనేక విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయి. అదే తరహాలో  తెలంగాణలో కూడా స్వతంత్ర ఫీజు  రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, తల్లిదండ్రుల ప్రతినిధులు,  ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉండాలి.  

పాఠశాలలు,  కళాశాలలు తప్పనిసరిగా ఫీజుల వివరాలను వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటించాలి. పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా పేరుతో అదనపు వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేసిన సంస్థలపై భారీ జరిమానాలు, గుర్తింపు రద్దు వంటి శిక్షలు విధించే నిబంధనలు ఉండాలి.  తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా సమగ్ర ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. 

- సొప్పరి నరేందర్, హెచ్​సీయూ–

గమనిక : ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.