లంచ్ టైమ్ వరకు కోర్టులోనే నిలబడండి...మధురానగర్ ఎస్ఐని ఆదేశించిన జడ్జి

లంచ్ టైమ్ వరకు కోర్టులోనే నిలబడండి...మధురానగర్ ఎస్ఐని ఆదేశించిన జడ్జి
  • రిటైర్డ్​ ఎస్‌‌ఐతో పోలీసులు
  •     వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి కేసు లేకపోయినా 75 ఏండ్ల రిటైర్డ్​ఎస్‌‌ఐని ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్లి అవమానకరంగా వ్యవహరించారనే ఆరోపణలపై మధురానగర్‌‌ పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరైన మధురానగర్‌‌ ఎస్‌‌ఐని భోజన విరామం వరకు కోర్టు హాల్‌‌లోనే నిలబడి ఉండాలని ఆదేశించింది. రిటైర్డ్​ పోలీసు అధికారి వ్యవహారంలోనే ఇలాంటి ప్రవర్తన ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 

యూసఫ్‌‌గూడకు చెందిన రిటైర్డ్‌‌ ఎస్‌‌ఐ మహ్మద్‌‌ ఉస్మాన్‌‌ దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం విచారణ జరిగింది. గత మే 18న ఉస్మాన్‌‌ ఇంట్లో ఉండగా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు పరిహారం ఇప్పించాలని ఆయన తరఫు లాయర్‌‌‌‌ కోర్టులో వాదించారు. ఉస్మాన్‌‌ బట్టలు వేసుకొని వచ్చేదాకా కూడా ఆగకుండా పోలీసులు ఆయనను లోదుస్తులతోనే పోలీస్‌‌ స్టేషన్​కు తీసుకెళ్లారని తెలిపారు. మార్గమధ్యంలో ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలినా పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా మధురానగర్‌‌ ఎస్‌‌ఐ ఇచ్చిన వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనిష్మెంట్‌‌ ఇచ్చింది.