సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బలమైన వ్యవస్థలు అవసరం : సుప్రీంకోర్టు జడ్జి అమానుల్లా

సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బలమైన వ్యవస్థలు అవసరం : సుప్రీంకోర్టు జడ్జి అమానుల్లా
  • చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి: సుప్రీంకోర్టు జడ్జి అమానుల్లా
  •     సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ రీసెర్చ్‌‌ యూనిట్ ప్రారంభించిన న్యాయమూర్తి
  •     కార్యక్రమంలో పాల్గొన్న పాట్నా  హైకోర్టు సీజే  మీనాక్షి మదన్ రాయ్, హైకోర్టు జడ్జిలు

హైదరాబాద్‌‌,వెలుగు: దేశంలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బలమైన పాలనా వ్యవస్థతో పాటు న్యాయ, సాంకేతిక వ్యవస్థలు అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా అన్నారు. డేటా, సైబర్ సెక్యూరిటీ, కంప్లయన్స్, గోప్యత, ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌, సైబర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని దర్యాప్తు సంస్థలకు సూచించారు. 

చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ (సీఎన్‌‌ఎల్‌‌యూ), హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న, ఉస్మానియా యూనివర్సిటిలో ఇంక్యుబేట్ అయిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ స్టార్టప్ ‘గిగా ఇన్నోవేషన్ టెక్నాలజీస్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ కంప్లయన్స్ రీసెర్చ్ యూనిట్’ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎన్‌‌ఎల్‌‌యూ చాన్స్‌‌లర్ జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాని టాగియా, జస్టిస్ రాజేశ్ కుమార్ వర్మ, బీహార్ అడ్వకేట్ జనరల్ సత్యదర్శి సంజయ్, సీఎన్‌‌ఎల్‌‌యూ వైస్ చాన్స్‌‌లర్ ప్రొఫెసర్  డా.ఫైజాన్ ముస్తఫా, గిగా ఇన్నోవేషన్ ఎండీ డా.తొగరు అభిషేక్ రెడ్డి సహా తదితరులు పాల్గొన్నారు. 

ఈ రీసెర్చ్ యూనిట్‌‌ ద్వారా ప్రజా విధానాలపై ప్రత్యేక స్టడీలతో పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు, సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించనున్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం–2023 అమలు, జాతీయ సైబర్ భద్రతా కార్యక్రమాలు, ఏఐ గవర్నెన్స్, డిజిటల్ పాలనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేపట్టనున్నట్టు గిగా ఇన్నోవేషన్ ప్రతినిధులు తెలిపారు.సైబర్ సెక్యూరిటీ, డేటా పరిరక్షణ రంగాల్లో పరిశోధన, విధాన సూచనలు, నైపుణ్యాభివృద్ధికి జాతీయ స్థాయిలో కీలక వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.