- ఉచితంగా నైపుణ్య శిక్షణ.. ఫార్మా రంగంలో ఉపాధి
- రేడియంట్, ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్‌తో ఇంటర్ విద్యాశాఖ ఎంఓయూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఇంటర్ విద్యాశాఖ అదిరిపోయే భరోసా ఇచ్చింది. చదువుతో పాటే చేతినిండా పని దొరికేలా రెండు పెద్ద కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రేడియంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ సంస్థలతో కలిసి విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు జాబ్స్ కూడా ఇప్పించనుంది.
బుధవారం హైదరాబాద్‌లో ఆయా సంస్థల ప్రతినిధులతో ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ ఎంఓయూలు (ఒప్పంద పత్రాలు) కుదుర్చుకున్నారు. రేడియంట్ ఇన్‌స్టిట్యూట్‌తో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం.. ఈటీ, ఈసీటీ, ఎంఈ ఒకేషనల్ గ్రూపుల స్టూడెంట్లకు ఇండస్ట్రీలో అవసరమయ్యే నైపుణ్యాలపై ‘ఆన్ ద జాబ్ ట్రైనింగ్’ (ఓజేటీ) ఇస్తారు. స్టూడెంట్లకే కాకుండా లెక్చరర్లకు కూడా కొత్త టెక్నాలజీపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెడతారు. ఈ శిక్షణ అంతా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా దొరుకుతుందని, దీనివల్ల స్టూడెంట్లలో స్కిల్స్ పెరిగి ఈజీగా ఉద్యోగాలు వస్తాయని డైరెక్టర్ అభిలాష అభినవ్ చెప్పారు.
ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లకు వరం..
ఇక ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ సంస్థతో జరిగిన ఒప్పందం ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లకు వరంలా మారనుంది. 2023 నుంచి 2026 మధ్య ఇంటర్ కంప్లీట్ చేసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు ఎమ్మెల్టీ, ఫార్మా టెక్నాలజీ ఒకేషనల్ స్టూడెంట్లను ఈ ఫార్మా కంపెనీ రిక్రూట్ చేసుకోనుంది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ కేఎల్ఎన్ మూర్తి అన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఇంటర్మీడియేట్ జేడీలు వెంక్య నాయక్, ఎస్‌ఐవీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్స్న రాణి, రేడియంట్ సంస్థ మేనేజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
