హైదరాబాద్, వెలుగు: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై జస్టిస్ కె. సుజన విచారణ చేపట్టి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పోలీసులకు, బాధితురాలి తల్లికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేశారు. తనపై నమోదైన కేసులో ప్రస్తుతం న్యాయ నిర్బంధంలో ఉన్న తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ కోర్టును కోరాడు.
తాను ఎలాంటి నేరం చేయలేదని, రాజకీయ కక్షతో తప్పుడు కేసులో ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నాడు. బాధితురాలితో పరస్పర అంగీకారంతో ప్రేమ సంబంధం కొనసాగిందని, అనంతరం ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోక్సో కేసు నమోదు చేశారని తెలిపాడు. సంఘటన జరిగినట్టు చెబుతున్న తేదీలకు దాదాపు 5 నెలల తర్వాత ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని, ఆలస్యానికి సరైన కారణం చూపలేదని పేర్కొన్నాడు. వాట్సాప్ మెసైజ్‌లు, ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాలు ఇద్దరి మధ్య పరస్పర సమ్మతితో సంబంధం కొనసాగిన విషయాన్ని నిర్ధారిస్తాయని తెలిపాడు. ఫిర్యాదులో పేర్కొన్న ఘటనల తర్వాత కూడా ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు కొనసాగాయని తెలిపారు.
దర్యాప్తు పూర్తయిందని, బాధితురాలి వాంగ్మూలాలు నమోదు చేశారని, వైద్య పరీక్షలు నిర్వహించి కీలక సాక్షులందరినీ విచారించారని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేసినా దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని, సాక్షులను ప్రభావితం చేయబోమని, ఆధారాలను తారుమారు చేయబోమని హామీ ఇచ్చాడు. గత మే 16 నుంచి రిమాండ్‌లో ఉన్నానని, ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు మాత్రమే గతంలో మధ్యంతర బెయిల్ లభించిందని, పరీక్షలు పూర్తయ్యాక తిరిగి లొంగిపోయానని వివరించాడు. ఇప్పటికే జిల్లా సెషన్ కోర్టు మూడు సార్లు రెగ్యులర్ బెయిల్‌ను తిరస్కరించినందున తనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు.
