మత్తు దిగట్లే...! డ్రగ్స్‌‌, గంజాయికి బానిసలవుతున్న స్టూడెంట్స్‌‌..మొదలవుతున్న కాలేజీలు... పేరెంట్స్, టీచర్లు బీ అలర్ట్‌‌...

మత్తు దిగట్లే...! డ్రగ్స్‌‌, గంజాయికి బానిసలవుతున్న స్టూడెంట్స్‌‌..మొదలవుతున్న కాలేజీలు... పేరెంట్స్, టీచర్లు బీ అలర్ట్‌‌...
  • కేసులు పెడుతున్నా  భయంలేదు..  డీ – అడిక్షన్‌‌ సెంటర్లతో మార్పు లేదు
  • రెండేండ్లలో 822 మందిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్
  • వీరిలో 200 మంది సప్లయర్లు    
  • మొదలవుతున్న కాలేజీలు.. పేరెంట్స్, టీచర్లు అలర్ట్‌‌గా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: కాలేజీల్లో చదువుకోవాల్సిన స్టూడెంట్స్‌‌ డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారు. సిగరెట్‌‌తో మొదలై గంజాయి, కొకైన్‌‌, ఎండీఎంఏ లాంటి సింథటిక్‌‌ డ్రగ్స్‌‌కు అలవాటుపడుతున్నారు. ఈ క్రమంలో పైసల కోసం సప్లయర్ల అవతారమెత్తుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు వీకెండ్ టూర్లకు వెళ్లున్నారు. రిటర్న్‌‌ జర్నీలో గంజాయి స్మగ్లింగ్‌‌ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌‌కు తీసుకొచ్చిన గంజాయిని చైన్ సిస్టమ్‌‌తో సప్లయ్ చేస్తున్నారు. రెండేళ్లలో మత్తుకు బానిసలైన 822 మంది స్టూడెంట్స్‌‌ ఈగల్ ఫోర్స్‌‌కు చిక్కారు. వీరిలో 200 మంది సప్లయర్లుగా మారినట్లు తేలింది. ఇలాంటి వారిపై ఎన్ని కేసులు పెడుతున్నా, డీ–అడిక్షన్ సెంటర్లకు పంపుతున్నా ఫలితం కనిపించట్లేదని పోలీసులు చెప్తున్నారు. కాలేజీలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు మత్తుకు బానిసలు కాకుండా పేరెంట్స్, టీచర్స్‌‌ అలర్ట్‌‌గా ఉండాలని, వారి ప్రవర్తనను గమనిస్తూ స్పందించాలని మానసిక నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.

విద్యాసంస్థలే టార్గెట్‌‌గా మత్తు దందా

ప్రధానంగా హైదరాబాద్ సహా చుట్టుపక్కల విద్యాసంస్థలనే డ్రగ్స్ మాఫియా టార్గెట్‌‌గా చేసుకున్నట్లు ఈగల్​ఫోర్స్ గుర్తించింది. మైనర్లు మొదలు ఇంజనీరింగ్‌‌ స్టూడెంట్స్‌‌ దాకా నెట్‌‌వర్క్ విస్తరించినట్లు తేల్చింది. పది, అంతకంటే ఎక్కువమంది ఒక్కో బ్యాచ్‌‌గా మారి, డ్రగ్స్ వాడుతున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. స్మగ్లర్లు ఏకంగా ఇంజనీరింగ్‌‌ కాలేజీల చుట్టుపక్కల డెన్‌‌లు ఏర్పాటు చేసుకుని విక్రయాలకు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు.  

డీ – అడిక్షన్‌‌ సెంటర్లకు 500 మంది 

మత్తు పదార్థాలు తీసుకుంటూ పట్టుబడిన విద్యార్థులను కోర్టులో హాజరుపర్చి, అవసరమైతే డీ–-అడిక‌‌్షన్‌‌ సెంటర్లకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 డీ–అడిక్షన్‌‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిలో మద్యానికి బానిసలైన వారితో పాటు డ్రగ్స్‌‌, గంజాయి కేసుల్లో ఈగల్ ఫోర్స్‌‌అరెస్ట్‌‌ చేసిన వారిని చేరుస్తున్నారు. మొత్తం మూడు దశల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈగల్ ఫోర్స్‌‌ అరెస్ట్‌‌ చేసిన వారిలో 500 మంది స్టూడెంట్స్‌‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరంతా మొదట్లో కౌన్సెలర్లు చెప్పిన మాట వినకపోవడంతో పాటు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అలాంటి వారికి మొదటి రెండు, మూడు రోజులు బాడీని డీటాక్సిఫికేషన్‌‌ చేసే మందులు ఇస్తున్నారు.

నెలకు సగటున 40 మంది 

ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా  204 మంది విద్యార్థులపై ఈగల్ ఫోర్స్ పోలీసులు ఎన్‌‌డీపీఎస్ యాక్ట్‌‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ లెక్కన నెలకు సగటున దాదాపు 40 మంది పట్టుబడుతున్నారు. డ్రగ్స్ వాడుతూ మొదటిసారి దొరికితే కేసులు నమోదు చేయడంలేదు. కౌన్సిలింగ్‌‌ ఇస్తున్నారు.  లేదంటే డీ–అడిక్షన్‌‌ సెంటర్లలో చేరుస్తున్నారు. అయినా మార్పురాని వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది 103 మంది విద్యార్థులను డీ–అడిక్షన్ సెంటర్లకు సిఫార్సు చేసింది. 

కౌన్సిలింగ్‌‌ ముగిశాక మళ్లీ మొదలు

మళ్లీ డ్రగ్స్‌‌, గంజాయి తీసుకోవాలనే ఆలోచనలు, క్రేవింగ్స్‌‌ను డాక్టర్లు తగ్గిస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా వారికి వ్యక్తిగతంగా, గ్రూప్‌‌గా కౌన్సెలింగ్‌‌ సెషన్లు నిర్వహిస్తున్నారు. కోపాన్ని, ఒత్తి‍డిని  తట్టుకోవడం, కుటుంబ విలువలు వంటి వాటి గురించి చెప్తున్నారు. కుటుంబాలతో కూడా కౌన్సెలింగ్‌‌ సెషన్స్‌‌ నిర్వహిస్తున్నారు. ఇలా వారిలో మత్తుపదార్థాల వైపు మళ్లకుండా మానసిక పరివర్తన తీసుకొస్తున్నారు. అయితే, కొంత మంది విద్యార్థులు డీ–అడిక‌‌్షన్‌‌ సెంటర్ల నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ మత్తుకు అలవాటు పడుతున్నట్లు ఈగల్ ఫోర్స్‌‌అధికారులు గుర్తించారు. కాలేజీల్లో అండర్ టేకింగ్‌‌ఇచ్చిన స్టూడెంట్స్‌‌ కూడా పలుమార్లు గంజాయితో చిక్కినట్లు తెలిసింది.

తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి


డ్రగ్స్, గంజాయిని 19 –25 ఏండ్ల వయస్సు వారే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. మత్తుకు బానిసలైన విద్యార్థులను టీచర్లు గుర్తించాలి. విద్యాసంస్థల పరిసరాల్లో మాదక ద్రవ్యాలను గుర్తిస్తే వెంటనే ఈగల్ ఫోర్స్‌‌ 1908 లేదా 8712671111 నంబర్లకు సమాచారం అందించాలి.

- సందీప్ శాండిల్యా, 
డైరెక్టర్, ఈగల్ ఫోర్స్