కమర్షియల్ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ ధరలు డౌన్.. రూ.183 తగ్గిన 19 కేజీల సిలిండర్ ధర

కమర్షియల్ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ ధరలు డౌన్.. రూ.183 తగ్గిన 19 కేజీల సిలిండర్ ధర
  • 5 కేజీల సిలిండర్ ధరలో రూ.13 తగ్గుదల
  • ఏటీఎఫ్ ధరలను కూడా తగ్గించిన ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు
  • నయారా బంకుల్లో దిగొచ్చిన పెట్రోల్, డీజిల్​ ధరలు
  • ఇక నుంచి ప్రభుత్వ బంకుల్లోని ధరలకు సమానంగా రేట్లు

న్యూఢిల్లీ:   గ్యాస్ ధరలు పెరగడంతో ఇబ్బందిపడుతున్న రెస్టారెంట్లు, హోటల్స్‌‌‌‌కు కొంత  ఊరట లభించింది. ఎల్‌‌పీజీ సప్లయ్ మెరుగవ్వడంతో  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్‌‌‌‌పీజీ ధరల్లో కోత పెట్టాయి.   19 కేజీల సిలిండర్ ధరను రూ.183.50   తగ్గించాయి.  దీంతో ధరలు  ఢిల్లీలో రూ.2,930 కి,   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రూ.3,191 దిగొచ్చాయి. అంతేకాకుండా   5 కేజీ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ సిలిండర్ ధరను కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్‌‌‌‌‌‌‌‌), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌‌‌‌‌‌‌‌పీసీఎల్‌‌‌‌‌‌‌‌) సంస్థలు  రూ.13 తగ్గించి రూ.808.50 గా నిర్ణయించాయి. ఇండ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం రూ.942 వద్దనే కొనసాగుతోంది.  ఈ ఏడాది కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలకు ఊరట

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి.  లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.5  తగ్గించగా,   ఢిల్లీలో దీని ధర రూ.110 కి చేరింది.  ఈ కంపెనీలు  ప్రతి నెలా మొదటి తేదీన అంతర్జాతీయ మార్కెట్ సగటు ధరలు, ఫారెక్స్ రేట్ల ఆధారంగా ఏటీఎఫ్‌‌‌‌‌‌‌‌, కమర్షియల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. అయితే, గత నెలలోనే ప్రభుత్వం ఏటీఎఫ్ ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను  ప్రవేశపెట్టింది. 

దీని ప్రకారం.. ఇండియా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు  గరిష్టంగా మూడేళ్లపాటు లీటరుకు రూ. 115 స్థిర ధరతో జెట్ ఇంధనాన్ని కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ అంతర్జాతీయంగా బేస్ రేట్ (లీటరుకు రూ. 86.32 , - అన్ని పన్నులు, మార్జిన్లు కలిపి రూ. 115 కి సమానం) కంటే ధరలు పెరిగితే, ఆ వ్యత్యాసాన్ని భరించడానికి ప్రభుత్వం చమురు సంస్థలకు వడ్డీ లేకుండా  అడ్వాన్సులను ఇస్తుంది.

 ధరలు తగ్గితే ఆ అదనపు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ నిధికి జమ చేస్తారు. ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఎన్ని విమానయాన సంస్థలు ఎంచుకున్నాయనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ పథకంలో చేరని సంస్థలు మాత్రం ప్రస్తుత మార్కెట్ ధరలనే (అంటే రూ. 110) చెల్లిస్తున్నాయి.

  మొదట పెంచి.. తర్వాత తగ్గించిన నయారా

 క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 73 డాలర్లకు పడడంతో పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ ధరలను  ప్రైవేట్ కంపెనీ నయారా ఎనర్జీ తగ్గించింది.  లీటర్ పెట్రోల్‌‌‌‌‌‌‌‌ ధరను రూ.5, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరను రూ.3 చొప్పున కోత పెట్టింది. దీంతో కంపెనీ ఆపరేట్ చేస్తున్న 7 వేల పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బంకుల్లో ఈ సవరించిన  ధరలు అమల్లోకి వస్తాయి.  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్రోల్ పై రూ. 5,  డీజిల్ పై రూ. 3 పెంచిన మొదటి సంస్థ నయారానే కావడం గమనార్హం. 

తాజా నిర్ణయంతో తన పాత ధరల పెంపును పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లయింది. కాగా, ఈ కంపెనీ గుజరాత్ లోని వాడినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడాదికి 2 కోట్ల టన్నుల సామర్థ్యం గల రిఫైనరీని  నిర్వహిస్తోంది. ఇటీవల రిఫైనరీ మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తి కావడంతో,  ప్రస్తుతం దేశీయ డిమాండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా పూర్తి సామర్థ్యంతో ఇది పనిచేస్తోంది. తాజా రేట్ల కోతతో కంపెనీ బంకుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు  ప్రభుత్వ బంకుల్లో రేట్లతో సమానంగా ఉన్నాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115 .69 వద్ద,  డీజిల్ ధర రూ.103.82  వద్ద ఉన్నాయి.