కానిస్టేబుల్ పోస్టులను 19 వేలకు పెంచాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

కానిస్టేబుల్ పోస్టులను 19 వేలకు పెంచాలి : ఎంపీ  ఆర్. కృష్ణయ్య
  •     నోటిఫికేషన్లు ఇవ్వకుంటే సెక్రటేరియెట్ ముట్టడిస్తం: ఎంపీ  ఆర్. కృష్ణయ్య వెల్లడి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీలో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లలో పేపర్ లీకేజీలు, ఆలస్యం వల్ల యువత నష్టపోయిందని గుర్తుచేశారు. 

ఎన్నికల హామీ ప్రకారం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ పోస్టులను 19 వేలకు పెంచాలని, వయోపరిమితి సడలించాలని, జీవో 46, జీవో 29లను రద్దు చేయాలని కోరారు. అలాగే 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, గ్రూప్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.సీఎం నిరుద్యోగులతో సమావేశమై ప్రత్యేక కమిటీ వేయాలని.. లేకుంటే లక్ష మందితో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు శంకర్ నాయక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.