భూ భారతి పోర్టల్‌‌లో పోడు భూముల నమోదు

భూ భారతి పోర్టల్‌‌లో పోడు భూముల నమోదు
  •     రైతు కమిషన్ చొరవతో గిరిజన రైతులకు ఊరట
  •     ప్రత్యేక మాడ్యూల్​ అందుబాటులోకి

హైదరాబాద్‌‌, వెలుగు:  పోడు పట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు దూరమైన ఆదివాసీ, గిరిజన రైతులకు రైతు కమిషన్ చొరవతో మేలు కలుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద పట్టాలు పొందిన 2.30 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6.70 లక్షల ఎకరాల భూముల వివరాలు  భూభారతి పోర్టల్‌‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మాడ్యూల్‌‌ను అందుబాటులోకి తెచ్చింది.  దీంతో  పోడు పట్టాలున్న  రైతులకు కూడా పంట రుణాలు, పంట నష్టపరిహారం, విద్యుత్ కనెక్షన్లు, బోర్లకు అనుమతులు లభించనున్నాయి.  

గతంలో ధరణి పోర్టల్‌‌లో పోడుభూముల వివరాలు నమోదు చేయకపోవడంవల్ల  బ్యాంకులు  పంట రుణాలు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు.  ఈ సమస్యలపై  స్పందించిన రైతు కమిషన్  ఎస్‌‌ఎల్‌‌బీసీ, రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు గిరిజన రైతులతో మాట్లాడి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. పోడుభూములు వివరాలు  భూభారతిలో నమోదైతే ఇతర రైతులు పొందుతున్న ప్రయోజనాలు గిరిజన, ఆదివాసీ రైతులకు కూడా అందుతాయని కమిషన్​ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వారి సూచన మేరకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద ఉన్న పోడు భూములను  భూభారతి పోర్టల్‌‌లో నమోదు చేసేందుకు  ప్రత్యేక మాడ్యూల్ రూపొందించాలని సీఎం రేవంత్​  నిర్ణయం తీసుకున్నట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి