ప్రభుత్వ స్కీమ్‌‌‌‌‌‌‌‌లకు ఏఐ ..అనర్హుల ఏరివేతకు, డీబీటీకి టెక్నాలజీ వాడాలి

ప్రభుత్వ స్కీమ్‌‌‌‌‌‌‌‌లకు ఏఐ ..అనర్హుల ఏరివేతకు, డీబీటీకి టెక్నాలజీ వాడాలి
  • రాబడి పెంపు.. పర్యవేక్షణకు చేజింగ్ సెల్ 
  • ఆదాయం పెరగాలంటే లీకేజీలు అడ్డుకోవాలి.. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు
  • హెచ్ఎండీఏ, టీజీఐఐసీలు టార్గెట్​ రీచ్ కావాల్సిందే
  • కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ శాఖలపై నిఘా పెట్టండి
  • ఊహలు కాదు..  బడ్జెట్​కు తగ్గట్టు ప్లాన్​లు ఉండాలి
  • అధికారులు నిర్లక్ష్యం  వీడాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ఏఐ వినియోగంతోపాటు డీబీటీకి అనుసంధానం చేస్తే అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.  దీంతో అర్హులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని,  సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకే చేరుతాయని వివరించారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌ఆర్డీ బోధి పెవిలియన్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  

రాష్ట్ర బడ్జెట్ నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవడమే ధ్యేయంగా ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.  కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవికత ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కేటాయింపులకు తగ్గట్టుగా రాబడులు పెంచుకోవడానికి ప్రతి శాఖ నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని 
స్పష్టం చేశారు. 

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు.. 

ఆదాయ సమీకరణలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి​ తేల్చి చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా సాగాలంటే నిధుల సేకరణే కీలకమని గుర్తుచేశారు. ఈ దిశగా అధికారులు సమన్వయంతో కదలాలని , ఆయా శాఖలు తమ పరిధిలోని వనరులను గరిష్టంగా వినియోగించుకుని పురోగతి సాధించాలని నిర్దేశించారు.  ముఖ్యంగా హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ, టీజీఐఐసీలాంటి కీలక సంస్థలు తమ పరిధిలో ఆదాయ సమీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. 

కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్‌‌‌‌‌‌‌‌లాంటి ప్రధాన శాఖల్లో ఎక్కడా లీకేజీలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు చేరేలా పారదర్శక విధానాలను అవలంబించాలని కోరారు. రాబడి పెంచేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించడంతోపాటు  క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ సెల్ నిరంతరం పనుల పురోగతిని, నిధుల సమీకరణను ఫాలోఅప్ చేస్తుందని వివరించారు. లీకేజీలను అరికట్టడం ద్వారానే ప్రభుత్వానికి రావాల్సిన అసలైన ఆదాయాన్ని కాపాడుకోగలమని చెప్పారు.  ఈ దిశగా అన్ని విభాగాల అధిపతులు తమ శాఖల పనితీరుపై నిత్యం సమీక్షలు జరుపుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భూసేకరణను స్పీడప్​ చేయాలి

అనుకున్న స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రతి విభాగం తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతా అంశంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీని వల్ల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు  అడ్డంకులు తొలగిపోతాయని, పనులు వేగవంతం అవుతాయని వివరించారు. 

 ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. బడ్జెట్ రూపకల్పన విషయంలో ఊహలకు తావులేకుండా కేవలం వాస్తవికత ఆధారంగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అందుకు తగ్గట్టుగానే రాబడి మార్గాలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర అత్యవసర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా బడ్జెట్‌‌‌‌ను సమగ్రంగా తయారు చేసుకోవాలని సూచించారు. 

వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.  నిధుల కొరత లేకుండా చూసేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.  రాబడి పెంపు, ఆర్థిక వనరుల సమీకరణలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే రాష్ట్ర ప్రగతి అనుకున్న విధంగా ముందడుగు వేస్తుందన్నారు.