- ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగులోకి.. నిగ్గు తేల్చేందుకు ఉన్నతాధికారుల కమిటీ
- ప్రభుత్వ భూములు ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరిగినట్టు అనుమానాలు
- మంత్రి పొంగులేటి ఆదేశాలు..
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ అక్రమాల సెగ ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకున్న ‘భూ భారతి’కి కూడా తాకింది. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన భూదందాలు, అక్రమాలకు పాల్పడినవాళ్లు భూ భారతి పోర్టల్‌లోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు మార్చే కుట్రకు తెరలేపినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. ఈ రెండు పోర్టళ్లలో జరిగిన సాంకేతిక లీకేజీలు, అనధికారిక ఎంట్రీలపై బుధవారం సెక్రటేరియెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా అక్రమార్కుల గుట్టు రట్టు చేసేందుకు ఐఏఎస్‌లు, ఐపీఎస్, ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. భూ రికార్డుల భద్రతతో చెలగాటమాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే విషయాలు..
ధరణి పోర్టల్‌పై ప్రస్తుతం కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్‌లో అనేక విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలోనే కావాలని కొన్ని భద్రతా లోపాలను వదిలేశారని నివేదికలో తేలింది. వాటిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు కొన్ని ప్రత్యేక మాడ్యూళ్ల ద్వారా అనధికారికంగా భూ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేశారని ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఇదే సమయంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించిన ‘భూ భారతి’ పోర్టల్ కూడా ధరణి తరహా సాంకేతిక నిర్మాణాన్ని పోలి ఉండటంతో కూడా అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
నాడు ధరణి పోర్టల్‌లో అక్రమ మాడ్యూల్స్‌ను సృష్టించిన వ్యక్తులే.. ఇప్పుడు ‘భూ భారతి’ వెనుక కూడా ఉన్నట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. లూప్‌హోల్స్ సృష్టించి ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట మార్చేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగినట్టు ప్రాథమిక విచారణలో స్పష్టంగా నిర్ధారణ అయింది.
అక్రమాలను వెలికితీసేందుకు ప్రత్యేక కమిటీ..
పోర్టళ్లలో జరిగిన ఈ భారీ అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ విచారణ కమిటీలో మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐటీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్ సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు అపూర్వ్ చౌహాన్, మంద మకరంద్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సంపత్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ సుభాషిణి, ఎన్‌ఐసీ సీనియర్ డైరెక్టర్ శ్రీనివాస సుబ్బారావును ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ ఉన్నతస్థాయి కమిటీ సాంకేతికపరమైన భద్రతా లోపాలను, ఆర్థిక అక్రమాలను క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఇందులో ఐటీ, సైబర్ సెక్యూరిటీ, రెవెన్యూ విభాగాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులు ఉండటంతో సాంకేతిక అక్రమాలతో పాటు వాటి వెనుక ఉన్న అసలు సూత్రధారులను సులభంగా పట్టుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
15 రోజుల్లోగా నివేదిక
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఎన్‌ఐసీ అత్యున్నత భద్రతా ప్రమాణాలతో సరికొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక విచారణ కమిటీ తన సమగ్ర దర్యాప్తును వేగవంతం చేసి కేవలం 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అక్రమార్కులపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు భూ రికార్డులకు తిరుగులేని భద్రత కల్పించేందుకు అవసరమైన మార్పులు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు, భూ యజమానుల ఆస్తుల రక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోదని, అక్రమాలకు తావులేకుండా సరికొత్త పారదర్శక వ్యవస్థను ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. భూ రికార్డుల భద్రత, సమగ్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ దిశగా అత్యంత పారదర్శక విధానాలను అవలంబిస్తామని వెల్లడించారు.
