- తుది తీర్పునకు లోబడి భూ లావాదేవీలు ఉండాలని స్పష్టం
- మూడు వారాల్లో రికార్డులు సమర్పించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కూకట్‌పల్లిలో జీఓసీఎల్ కార్పొరేషన్, హిందూజా ఎస్టేట్స్, స్క్వేర్‌స్పేస్ ఇన్‌ఫ్రా సిటీ, ఆనర్ హోమ్స్ తదితర సంస్థలకు చెందిన సుమారు 300 ఎకరాల భూ విక్రయాలపై మధ్యంతర స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ భూములకు సంబంధించిన అన్ని విక్రయ లావాదేవీలు రిట్ పిటిషన్‌పై వెలువడే తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే పూర్తి రికార్డులతో 3 వారాల్లో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం ఉత్తర్వులిచ్చారు.
బోడుప్పల్‌కు చెందిన వ్యాపారవేత్త చింతల శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పాశం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించిన జీఓసీఎల్ భూములను నిబంధనలకు విరుద్ధంగా విల్లాల ప్లాట్లుగా మార్చి విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు, ప్రైవేటు సంస్థలు కుమ్మక్కయ్యాయన్నారు. తక్కువ విలువ చూపించి రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి రూ.466 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. చెరువు భూమిని ప్రైవేటు భూమిగా మ్యుటేషన్ చేశారని, అటవీ భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
నాలెడ్జ్ పార్కు కోసం కేటాయించిన భూమిలో ఆ ప్రాజెక్టే లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీఓసీఎల్ తరఫున న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డి వాదిస్తూ, అవి 1966 నుంచి 1975 మధ్యకాలంలో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములని తెలిపారు. ఇప్పుడు యాజమాన్యాన్ని ప్రశ్నించడం సరికాదన్నారు. ఆనర్ హోమ్స్ తరఫున న్యాయవాది ఎల్. రవిచందర్ రిట్ పిటిషన్‌ను ప్రారంభ దశలోనే కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వం న్యాయవాది మురళీధర్ రెడ్డి 1970 నాటి రికార్డులను పరిశీలించాల్సి ఉందని, వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు. స్పందించిన హైకోర్టు 3 వారాల గడువిస్తూ రికార్డులు సమర్పించాలంది.
