- ఎక్కడైనా చర్చకు సిద్ధం.. నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంట
- రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ అడ్డగోలుగా మాట్లాడ్తుండని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎగవేతల పాలన నడుస్తున్నదని, ఇంతటి రాజకీయ భావదారిద్ర్యాన్ని దేశంలో ఎక్కడా చూడలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంత దివాళా తీసినోళ్లైనా.. తాను దివాళా తీశానని చెప్పుకుంటూ మెడలో బోర్డు వేసుకోరని, కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రం దివాళా తీసిందంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉండడం దురదృష్టకరమన్నారు. ఆయన నడుపుతున్న రాష్ట్రాన్ని ఆయనే తిట్టడం దారుణమన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదని చెప్తున్న రేవంత్ రెడ్డి.. 72 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఢిల్లీలో తెలంగాణను అసహ్యించుకోవట్లేదని, రేవంత్‌ను అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసు, రాష్ట్రంలో పాలనతీరు చూసి ఛీ కొడుతున్నారని మండిపడ్డారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాకపోయినా.. రేవంత్‌కు మాత్రం మరోసారి అధికారం రాదన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు.
రేవంత్‌కు బాహుబలిలో భళ్లాలదేవుడి గతే పడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం రూ.1.13 లక్షల కోట్లను ఎగ్గొట్టిందని ఆరోపించారు. రైతు భరోసా రూ.30 వేల కోట్లు.. కౌలు రైతులకు రూ.22,500 కోట్లు, రుణమాఫీ రూ.29,500 కోట్లు, రైతు కూలీలకు రూ.19,000 కోట్ల చొప్పున ఎగవేతలు చేశారన్నారు. రైతు భరోసాపై ఎక్కడ చర్చకు పిలిచినా సరే తాను వస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీనా, బోధిపెవిలియన్‌లో పెడ్తవా ఎక్కడ పెడ్తారో చెప్పాలన్నారు. రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ చౌరస్తాలో పెట్టినా వస్తానని, రాహుల్ గాంధీని కూడా పిలవాలన్నారు. అక్కడ కాకుంటే అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైనా చర్చకు సిద్ధమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించకుంటే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు.
కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లే..
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చారని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రాజెక్టులు ఏండ్ల నుంచి ముక్కిపోతుంటే కేవలం నాలుగేండ్లలోనే కాళేశ్వరాన్ని కట్టారన్నారు. కానీ, రేవంత్ చేసే పనుల వల్లే రాష్ట్రం దిగజారిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణపై రూ.72 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ టర్మ్ అయిపోయేనాటికి ఆ అప్పులు రూ.3.50 లక్షల కోట్లకు పెరిగాయని కాగ్ లెక్కలను పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించిందన్నారు. ఈ లెక్కన కేసీఆర్ చేసిన అప్పులు రూ.2.80 లక్షల కోట్లేనని పేర్కొన్నారు.
అప్పులకే నెలకు రూ.6 వేల కోట్లు కడ్తున్నామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని, ఏనాడూ రూ.4 వేల కోట్లకు మించి కట్టలేదని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. రేవంత్ కుటుంబ దోపిడీ వల్లే తెలంగాణ ఆస్తులను కోల్పోతున్నదని ఆరోపించారు. ‘‘నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు ఇన్వెస్టర్ల నెత్తికి తుపాకీ పెట్టి బెదిరించారని మంత్రి కూతురే చెప్పారు. ఎల్ అండ్ టీ సీఎఫ్వోని జైలులో పెడ్తా అని బెదిరింపులు.. ఎస్బీఐకి బెదిరింపులు.. ఇట్లా చేస్తే ఇన్వెస్టర్లు ఎట్లొస్తరు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
