- ఇద్దరు హోల్‌సేల్, ఒక రిటైల్ డీలర్‌ను అరెస్ట్ చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో 6 వేల యూరియా బస్తాలు మాయమైన ఘటనను ఫర్టిలైజర్ యాప్ ద్వారా గుర్తించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాప్ ఆధారంగా అక్రమాలను గుర్తించి ఇద్దరు హోల్‌సేల్ డీలర్లు, ఒక రిటైల్ డీలర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని, వారి లైసెన్సులను రద్దు చేశామని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వ్యవసాయశాఖ అధికారిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
యూరియా పంపిణీలో పారదర్శకత..
ఫర్టిలైజర్ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎరువుల పంపిణీ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతోందని మంత్రి తెలిపారు. దీంతో తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను వెంటనే గుర్తించే అవకాశం ఏర్పడిందన్నారు. సిద్దిపేటతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ ఎరువుల పంపిణీలో జరిగిన అక్రమాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. యూరియా పంపిణీ పూర్తిగా యాప్ ద్వారానే జరుగుతుండటంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ యూరియాను ఎవరైనా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..
అందుబాటులో 3.64 లక్షల టన్నుల యూరియా
రాష్ట్రంలో ప్రస్తుతం 3.64 లక్షల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. కేంద్రం కేటాయించిన 6 లక్షల టన్నుల లక్ష్యానికి గాను ఇప్పటికే 5.62 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి రప్పించినట్లు చెప్పారు. రైతులకు ఎలాంటి కొరత రాకుండా యూరియా యాప్‌పై కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం పెద్దఎత్తున వినియోగిస్తున్నారని మంత్రి అన్నారు. ఇప్పటివరకు 52.30 లక్షల యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకోగా, వాటిలో 46.03 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
