- హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా
- పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు..
- ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన పోలీసులు
నల్గొండ/ఇబ్రహీంపట్నం, వెలుగు: నేరాలకు పాల్పడుతూ పదేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు ఎట్టకేలకు చిక్కాడు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బొంగుళూరు ఎగ్జిట్-12 వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు సినీ ఫక్కీలో అతడిని ఛేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు.
వందకు పైగా నేరాలు..
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజుపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా దొంగతనం, దోపిడీ కేసులు ఉన్నాయి. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. దాదాపు 20 చోట్ల నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. మాస్క్ లేకుండానే దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాల్లో పలుమార్లు రికార్డయ్యాడు. నల్గొండ జిల్లాలో దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. 2007లో గుంటూరు జిల్లాలో ఒక కానిస్టేబుల్ హత్య కేసులో ఇతడు ఏ2గా ఉన్నాడు. నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతడి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని మిర్యాలగూడ పోలీసులు గతంలోనే ప్రకటించారు.
బొంగుళూరు ఎగ్జిట్-12 వద్ద హైడ్రామా..
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. శ్రీకాంత్ ఏపీ సరిహద్దు వాడపల్లి నుంచి లారీలో వస్తున్నాడన్న పక్కా సమాచారంతో నల్గొండ సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. వాడపల్లి నుంచి వెంబడిస్తూ బొంగుళూరు ఎగ్జిట్-12 వద్ద లారీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
అంతలోనే పోలీసులు అతడిని పట్టుకునే క్రమంలో, తన వద్ద ఉన్న కత్తితో పోలీసులపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీకాంత్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
అక్కడి నుంచి విచారణ నిమిత్తం నల్గొండకు తరలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడికి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
