కరీంనగర్ లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్ లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ 2 డిపోలో బుధవారం ఉదయం మరో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు నిలిపే ప్రదేశంలో బస్సుకు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట బ్యాటరీ వద్ద మంటలు ప్రారంభమై, క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. 

ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. చార్జింగ్ పాయింట్ వద్ద ఉన్న ఇతర బస్సులకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇటీవల అలుగునూర్ లోనూ ఓ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైన ఘటన చోటుచేసుకోగా, తాజాగా డిపోలోనే మరో బస్సు కాలిపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.