గోదావరి నదిపై మహారాష్ట్రలో తెరుచుకున్న బాబ్లీ గేట్లు

గోదావరి నదిపై మహారాష్ట్రలో తెరుచుకున్న బాబ్లీ గేట్లు
  • సెంట్రల్​వాటర్​ కమిషన్ పర్యవేక్షణలో మొత్తం 14 గేట్లు ఓపెన్
  • అక్టోబర్​28 వరకు దిగువకు నీటి విడుదల

నిజామాబాద్/బాల్కొండ, వెలుగు :  గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్​గేట్లు బుధవారం ఓపెన్ అయ్యాయి. సెంట్రల్ వాటర్ కమిషన్​(సీడబ్ల్యూసీ) ఇంజినీర్లు ఎన్.చరణ్, సాయిప్రణీత్, శ్యాంప్రకాశ్ పర్యవేక్షణలో నాందేడ్, ఎస్సారెస్పీ ఇంజినీర్ల సమక్షంలో ప్రాజెక్టుకు చెందిన మొత్తం 14 గేట్లు ఓపెన్ చేశారు. బాబ్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 2.74 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

ప్రాజెక్ట్ గేట్లు అక్టోబర్ 28 వరకు తెరిచి ఉండనున్నాయి. గేట్లు ఓపెన్ కావడంతో నీరు ప్రస్తుతం ఎస్పారెస్పీకి చేరుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి కెపాసిటీ 80.50 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 15.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు కాకతీయ కెనాల్ కు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా... 286 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది.