ఇరాన్‌‌‌‌‌‌‌‌ పై మరోసారి యుద్ధం?...పని పూర్తి చేయడంపై ట్రంప్‌‌‌‌‌‌‌‌కు ఆర్మీ ఆఫీసర్ల బ్రీఫింగ్

ఇరాన్‌‌‌‌‌‌‌‌ పై మరోసారి యుద్ధం?...పని పూర్తి చేయడంపై ట్రంప్‌‌‌‌‌‌‌‌కు ఆర్మీ ఆఫీసర్ల బ్రీఫింగ్
  •     మళ్లీ దాడులపై ట్రంప్ చర్చించినా.. ప్రస్తుతానికి దౌత్యానికే మొగ్గు
  •     వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో వెల్లడి
  •     అవసరమైతే మూడోసారి వస్తాం.. ఇరాన్‌‌‌‌‌‌‌‌కు నెతన్యాహు హెచ్చరిక

వాషింగ్టన్: ఇరాన్‌‌‌‌‌‌‌‌పై మరోసారి పూర్తి స్థాయి యుద్ధానికి దిగే విషయంపై ఆర్మీ ఉన్నతాధికారులతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, కొన్ని రోజులుగా ఇరాన్‌‌‌‌‌‌‌‌తో పూర్తి స్థాయి యుద్ధానికి దిగే అంశంపై రక్షణ మంత్రి పీట్ హెగ్‌‌‌‌‌‌‌‌సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్‌‌‌‌‌‌‌‌లతో ట్రంప్ పలుమార్లు మాట్లాడారని తెలిపింది. 

ఆ పత్రిక కథనం ప్రకారం.. సైనిక ప్రత్యామ్నాయాలపై దేశ అధ్యక్షుడికి రక్షణ శాఖ బ్రీఫింగ్ ఇవ్వడం అనేది ఘర్షణలు లేదా ఉద్రిక్తతల సమయంలో సాధారణమే అయినప్పటికీ, ఇరాన్ అంశంపై ట్రంప్ క్రమం తప్పకుండా అధికారిక, అనధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ప్రస్తుత తాజా చర్చలను బట్టి చూస్తే, ఇరాన్‌‌‌‌‌‌‌‌తో ఉన్న స్తబ్దతను తొలగించడానికి ఆయన మార్గాలను అన్వేషిస్తున్నారని, దాడులను పునరుద్ధరించే అవకాశాన్ని తోసిపుచ్చలేదని స్పష్టమవుతోంది. అయితే, ట్రంప్ తిరిగి యుద్ధానికి వెళ్లాలని భావించడం లేదని, దాడులను మళ్లీ ప్రారంభిస్తే ఇరాన్ అణు కార్యక్రమాన్ని అణచివేయడానికి అమెరికాకు ఉన్న అవకాశాలు దెబ్బతింటాయని ఆయన నమ్ముతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 

మరోవైపు ఇరాన్‌‌‌‌‌‌‌‌కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. అవసరమైతే తమ సైన్యం మూడోసారి కూడా ఇరాన్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశిస్తుందని అన్నారు. ‘‘అణుబాంబుల విధ్వంసం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి గతంలో రెండుసార్లు ఇరాన్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాం. అవసరమైతే మూడోసారి కూడా ప్రవేశిస్తాం’’ అని నెతన్యాహు చెప్పారు. ‘‘నేను ప్రధాన మంత్రిగా ఉన్నంత కాలం, ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండవు’’ అని ఆయన స్పష్టం చేశారు.