- భారతీయ కళాకారిణి రంగోలి డిజైన్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్: దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే అక్టోబర్‌లో ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నట్టు అమెరికా పోస్టల్ సర్వీస్ (యూఎస్‌పీఎస్) ప్రకటించింది. దీపావళి స్టాంపుతోపాటు ఇతర ప్రత్యేక స్టాంపులను ఆవిష్కరించింది. ఇందులో హ్యూస్టన్‌కు చెందిన భారతీయ కళాకారిణి సంగీత భూతడ రూపొందించిన ఒక క్లిష్టమైన రంగోలి (ముగ్గు) నమూనాతో కూడిన దీపావళి స్టాంపు ప్రత్యేకంగా నిలవనుంది.
ఈ రంగోలి ఫొటోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ బినయ్ దీక్షిత్ తీశారు. సాంప్రదాయబద్ధంగా రంగులు కలిపిన బియ్యం పిండి, చాక్ పీస్ పొడి, పూల రెక్కలతో తయారుచేసే ముగ్గులు ఎంతో చైతన్యవంతమైనవని, ఇవి అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారని యూఎస్‌పీఎస్ ఈ రంగోలిని అభివర్ణించింది. ఈ స్టాంపును జెన్నిఫర్ ఆర్నాల్డ్ డిజైన్ చేయగా, విలియం జె. గికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
‘‘హిందూ క్యాలెండర్‌లోని అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఈ వార్షిక శరదృతువు పండుగను.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. దీపావళిని సాధారణంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.
2026లో ఈ పండుగ నవంబర్ 8న వస్తుంది’’ అని యూఎస్‌పీఎస్ పేర్కొంది. కాగా, సంగీత భూతడ భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్ ప్రాంతంలో నివసిస్తున్న ఆమె.. దాదాపు 30 ఏళ్లుగా ఈ పురాతన జానపద కళ అయిన రంగోలిని ప్రదర్శిస్తున్నారు.
