- ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు
హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సపావత్ దుర్గా రాంకుమార్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. తోటి ఉద్యోగులు, మెడికల్ ఆఫీసర్లు, మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ, వెకిలి వ్యాఖ్యలతో వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కూకట్‌పల్లి జోన్ డీఎంహెచ్‌గా పనిచేసిన డాక్టర్ దుర్గా రాంకుమార్ జూన్ 8న హనుమకొండ డీఎంహెచ్‌వోగా బదిలీపై వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మెడికల్ ఆఫీసర్లు, మహిళా సిబ్బందిపై వేధింపులు పెరిగినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం గర్భిణిగా ఉన్న ఓ మెడికల్ ఆఫీసర్‌ను ఆఫీస్‌కు పిలిపించి రెండు నుంచి మూడు గంటల పాటు వేచి ఉండేలా చేశారని సమాచారం. మరుసటి రోజు మళ్లీ రావాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆమె ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరో మహిళా మెడికల్ ఆఫీసర్‌ను పనిష్మెంట్ పేరుతో నిలబెట్టారని, చాలాసేపు నిలబెట్టడంతో పక్కనే ఉన్న మరో అధికారి కూర్చోవాలని చెప్పగా, ఆ అధికారిపైనా డీఎంహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారసత్వ నియామకాల ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను ‘బిచ్చగాళ్లు’ అంటూ అవమానిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యేకు ఫిర్యాదు..
డీఎంహెచ్‌వో తీరుపై వివాదం చెలరేగడంతో టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని హనుమకొండ బాలసముద్రంలోని క్యాంప్ ఆఫీస్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వెంటనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ చేసి విషయం వివరించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి, వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు టీఎన్‌జీవోస్ నేతలు తెలిపారు.
డీఎంహెచ్‌వోపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్, టీజీవో, ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ విషయమై డాక్టర్ దుర్గా రాంకుమార్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు.
