హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణ అభివృద్ధి, అప్పులు, ఆదాయం, సంక్షేమ పథకాలపై నీతో చర్చించే సమయం, తీరిక సీఎం రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నికల్లో ఇచ్చిన, ఇవ్వని హామీలను అమలు చేయడంలో ఆయన బిజీగా ఉన్నారు. అందుకే సీఎం నీతో చర్చకు రాలేరు.. పైగా ఆయనతో చర్చించే స్థాయి నీది కాదు. నువ్వు ఓ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌వి, నేను కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను.. రాష్ట్ర అభివృద్ధిపై నాతో చర్చకు రా.. నేను సిద్ధంగా ఉన్న”అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
కేటీఆర్.. నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, కానీ మీ నాయన కేసీఆర్ చేసిన అప్పులు, వాటికి మిత్తీలు కట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారన్నారు. అయోధ్యలోని రాముడి గుడిలో దొంగతనం అనేది చిన్న విషయమని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అనడంపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలోని రామ భక్తుల విశ్వాసాలను వమ్ము చేసిన విషయం ఇది. ఇదే సంఘటన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే బీజేపీ నాయకులు మౌనంగా ఉండేవారా, నానా యాగీ చేసేవారని మండిపడ్డారు.
