మదర్ డెయిరీలో జీతాల కోత..! కేడర్‌‌ ను బట్టి 15 నుంచి 30 శాతం వరకు శాలరీ కట్

మదర్ డెయిరీలో జీతాల కోత..! కేడర్‌‌ ను బట్టి 15 నుంచి 30 శాతం వరకు శాలరీ కట్
  • ఎన్‌‌డీడీబీ చేతికి వెళ్లినా తగ్గని ఆర్థిక ఒత్తిడి
  • పెట్రోల్, ట్రావెల్ అలవెన్స్‌‌లకు పూర్తి బ్రేక్
  • 500 మందికి పైగా ఉద్యోగుల జీతాలే నెలకు కోటికి పైగా..
  • వర్కర్​ కేడర్​కు కోత నుంచి మినహాయింపు
  • డెయిరీ పటిష్టత కోసమేనన్న యాజమాన్యం

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు యాదాద్రి మదర్ డెయిరీ(నార్మాక్స్) కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రూ.70 కోట్ల అప్పుల భారం మోస్తున్న డెయిరీ.. ఇప్పుడు ఉద్యోగుల జీతాలపై కోతలు విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. కేడర్‌‌ను బట్టి 15 నుంచి 30 శాతం వరకు జీతాల్లో కోత పెట్టడంతో పాటు పెట్రోల్, ట్రాన్స్‌‌పోర్ట్ అలవెన్స్‌‌లను పూర్తిగా నిలిపివేసింది. 

ఎన్‌‌డీడీబీ టేకోవర్ తర్వాత రైతుల పాల బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ, ఉద్యోగుల జీతభత్యాల భారం మాత్రం యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆదాయం–వ్యయం మధ్య పెరుగుతున్న అంతరంతో ఖర్చు తగ్గింపే మార్గమని డెయిరీ భావిస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన, భవిష్యత్‌‌పై అనిశ్చితి నెలకొంది.

యాదాద్రి, వెలుగు: మదర్ డెయిరీ (నార్మాక్స్) ఖర్చు తగ్గింపు చర్యలను ప్రారంభించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు ఉద్యోగుల జీతాల్లో కోతలు కొనసాగనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేసింది. రూ.70 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన నార్మాక్స్‌‌ను ఇటీవల నేషనల్ డెయిరీ డెవలప్‌‌మెంట్ బోర్డు(ఎన్‌‌డీడీబీ) టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. డెయిరీకి చెందిన భూములను తీసుకుని బ్యాంకు అప్పుల్లో రూ.27 కోట్లు చెల్లించడంతో పాటు మరో రూ.13 కోట్లు డెయిరీకి చెల్లించి, 2026 మే 23 నుంచి బాధ్యతలు స్వీకరించింది. 

ఒప్పందం ప్రకారం 15 ఏళ్లపాటు మదర్ డెయిరీ నిర్వహణ ఎన్‌‌డీడీబీ ఆధ్వర్యంలో కొనసాగనుంది. అయితే రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించిన బిల్లులు మాత్రమే ఎన్‌‌డీడీబీ చెల్లిస్తోంది. సెంటర్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల భారం మాత్రం మదర్ 
డెయిరీపైనే ఉంది.

కమీషన్‌‌, గుడ్‌‌విల్‌‌ పైనే ఆదాయం..

గత పాలకవర్గాలు అవసరం ఉన్నా లేకున్నా భారీగా ఉద్యోగులను నియమించాయని, ప్రస్తుతం 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని సమాచారం. వారిలో ఎక్కువ మందిని పర్మినెంట్ చేయడంతో నెలకు రూ.కోటికి పైగా జీతాల భారం పడుతోంది. పాల సేకరణకు లీటరుకు రూ.6.50 చొప్పున కమీషన్‌‌ను ఎన్‌‌డీడీబీ చెల్లిస్తోంది. 

అదనంగా సంవత్సరానికి రూ.5 కోట్లు గుడ్‌‌విల్‌‌గా ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి రోజుకు 17,500 లీటర్ల పాలు మాత్రమే సేకరిస్తున్నారు. దీంతో రోజుకు సుమారు రూ.1.14 లక్షలు, నెలకు రూ.35 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. గుడ్‌‌విల్ మొత్తాన్ని నెలవారీగా లెక్కిస్తే మరో రూ.45 లక్షల వరకు వస్తోంది.

కేడర్‌‌ను బట్టి కోత..

కమీషన్‌‌, గుడ్‌‌విల్ ద్వారా నెలకు రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్య ఆదాయం వస్తుండగా, జీతాలకే రూ.కోటికి పైగా వెచ్చించాల్సి వస్తోంది. అదనంగా పెట్రోల్ అలవెన్స్, ట్రాన్స్‌‌పోర్ట్ అలవెన్స్, ప్రతి ఉద్యోగికి నెలకు రూ.1,400 కన్వేయన్స్  కూడా చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాల కోత తప్పదని యాజమాన్యం నిర్ణయించింది. 

టైమ్ స్కేల్ కేడర్‌‌కు 15 శాతం, సెక్యూరిటీ అసిస్టెంట్ నుంచి బ్రాయిలర్ ఆపరేటర్ వరకు ఉన్న తొమ్మిది కేడర్లకు 25 శాతం కోత విధించారు. మిగతా హయ్యర్ కేడర్లకు 30 శాతం జీతం తగ్గించారు. అయితే వర్కర్ కేడర్ ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించలేదు. అందరికీ యథావిధిగా నెలకు రూ.1,400 కన్వేయన్స్ అలవెన్స్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకే..

డెయిరీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల జీతాల్లో కోత విధించామని ఎంప్లాయిస్​కు పంపిన పోస్ట్​లో  మదర్​ డెయిరీ ఎండీ కోదండపాణి తెలిపారు. ఈ కోతలు ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకు ఉంటాయని, అందరూ సహకరించాలని కోరారు. డెయిరీ ఆర్థికంగా బలోపోతం అయిన వెంటనే కోతలు లేకుండా జీతాలు చెల్లిస్తామని తెలిపారు.

పెట్రోల్‌‌, ట్రావెల్ అలవెన్స్ రద్దు


ఉద్యోగులకు ఇస్తున్న పెట్రోల్, ట్రావెల్ అలవెన్స్‌‌ను పూర్తిగా తొలగించారు. ముఖ్యంగా ఒక సెంటర్ నుంచి మరో సెంటర్‌‌కు వెళ్లే ఉద్యోగులు ఈ అలవెన్స్ పొందేవారు. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా వీటిని రద్దు చేశారు. అయితే పాల ట్యాంకర్ డ్రైవర్లు, హయ్యర్ కేడర్‌‌లోని సీఈవో, ఎండీ, చైర్మన్‌‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.