- దీనిపై చర్చకు తెలంగాణ భవన్‌కు వస్తా..
- సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, తాను చెప్పిన ఈ లెక్కలు అబద్ధం అని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ ఇస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దీనిపై చర్చించేందుకు గురువారం తెలంగాణ భవన్‌కు వస్తానని కేటీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. బుధవారం సాయంత్రం సీఎల్పీలో మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రాజేశ్‌రెడ్డితో కలిసి జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. ‘మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. చేసినవన్నీ చేసి, ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం ఇప్పటికైనా మానుకోవాలి’ అని కేటీఆర్‌కు జూపల్లి హితవు పలికారు.
ప్రజల్నే తప్పు పడ్తరా?
కేటీఆర్, హరీశ్‌కు చిన్న, పెద్ద మెదడు చిట్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. ‘తెలంగాణ సొమ్ముతో పదేండ్లపాటు జల్సాలు చేశారు.. లెక్కలేనన్ని తప్పులు చేశారు. మీరు చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గద్దె దించితే, ప్రజల్నే తప్పుపడుతారా..’ అంటూ ఫైర్ అయ్యారు. ఇంకా మీ గారడీ మాటలతో ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తే వారు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ‘రుణ మాఫీ చేసేందుకు నాలుగేళ్ల సమయం తీసుకున్న మీరు, రైతు బంధు కోసం ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్న మీరు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఒకేసారి రూ.20 వేల 157 కోట్ల రుణ మాఫీ చేసిన మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా..’ అని నిలదీశారు. బీఆర్ఎస్ మెనిఫెస్టో భగవద్గీత, ఖురాన్‌తో సమానమని చెప్పిన కేసీఆర్.. దళితులకు మూడెకరాల భూమి, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఉద్యమ ఆకాంక్షకు విరుద్ధంగా కేసీఆర్ పాలన
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు విరుద్ధంగా కేసీఆర్ పాలన చేశారని, అందుకే ఆయన్ను ప్రజలు గద్దె దించారని జూపల్లి ఆరోపించారు. ‘అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో పాలన చేసిన మీరు.. తెలంగాణ సొమ్మును కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు. బీఆర్ఎస్ గొప్ప పాలన చేసిందని చెప్తున్న మీరు... అదే నిజమైతే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎందుకు గద్దె దింపారో చెప్పాలి? ఇటీవల నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేశారని మసిపూసి మారేడు కాయ చేసి, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితనే అయితే బీఆర్ఎస్ ఎందుకు అధికారం కోల్పోయిందని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యత్వం మేధావులకు ఇస్తారు. కాని మందు పోయడంలో మేధావి అయిన సంతోష్‌కు ఇచ్చారని జూపల్లి ఎద్దేవా చేశారు.
