- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
- నితిన్ నబీన్ వస్తే రేవంత్‌రెడ్డికి ఎందుకు భయం?
- ఆర్ఆర్ ట్యాక్స్‌ను ఎండగడితే ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నడు
- దమ్ముంటే అభివృద్ధిపై సెక్రటేరియెట్ మెట్ల మీద చర్చకు రా! అని పీసీసీ చీఫ్‌కు సవాల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బెంగాల్ కంటే ఎక్కువ రాజకీయం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలు ఫిక్స్ అయ్యారని తెలిపారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.
బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందని, బూత్ స్థాయి సమావేశాలకు వస్తున్న వేలాది మందిని చూసి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని అన్నారు. నితిన్ నబీన్ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ గురించి మాట్లాడారని గుర్తుచేశారు.
ఓ ప్రధాన పార్టీ జాతీయ అధ్యక్షుడిని ‘నితిన్ నబీన్ ఎవరు?’ అని సీఎం మాట్లాడటం సిగ్గుచేటని, ఇదంతా భయంతోనే మాట్లాడారని ఎద్దేవా చేశారు. నితిన్ నబీన్ వచ్చిందే రేవంత్‌ను గద్దె దించడానికి అని అన్నారు. గతంలో కేసీఆర్ కూడా నడ్డాను అవమానించారని, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో రేవంత్ చూసుకోవాలని హెచ్చరించారు.
నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన తాము ఊహించిన దాని కంటే ఎక్కువే విజయవంతమైందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాంచందర్‌రావును బీజేపీ నేతలు సత్కరించారు.
సెక్రటేరియెట్ దగ్గర తేల్చుకుందాం..
అభివృద్ధిపై చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని రాంచందర్‌రావు పేర్కొన్నారు. దమ్ముంటే సెక్రటేరియెట్ గేటు ముందు రెండు కుర్చీలు వేసుకుని చర్చిద్దామని, కాంగ్రెస్ వైఫల్యాలు, మోదీ సర్కార్ చేసిన డెవలప్‌మెంట్ మీద బహిరంగంగా మాట్లాడుకుందామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి బాబు మోహన్‌లా యాక్టింగ్ చేయడం మాని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత అనేది కేవలం ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత మాత్రమేనని ఆరోపించారు.
బీజేపీలో చేరేందుకు చాలామంది రెడీ..
బీజేపీలో చేరేందుకు చాలా మంది రెడీగా ఉన్నారని రాంచందర్ రావు అన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గతంలోనే చేరేందుకు రెడీ కాగా, ఆ పార్టీ అధిష్టానం గుర్తించి మళ్లీ వారిని ఆపిందని, కానీ వారంతా తమతో టచ్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు.
‘సర్’పై రాద్ధాంతం..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనేది కేంద్రం ప్రక్రియ అని, కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని రాంచందర్‌రావు తెలిపారు. ఎవరికైనా అంత ఇబ్బంది ఉంటే కోర్టులకు వెళ్లాలని సూచించారు. దీనిద్వారా కేవలం డబుల్ ఓట్లు, ఫేక్ ఓట్లు మాత్రమే పోతాయని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి నిదర్శనం కాదన్న విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ తెలుసుకోవాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని, యువత, మహిళలు, రైతులను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. చత్తీస్‌గఢ్‌లో బఘేల్ సర్కార్ కూలిపోయినట్టే, తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా పడిపోవడం ఖాయమని అన్నారు. రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని నితిన్ నబీన్ అన్నది అక్షర సత్యమని, రేవంత్ ఫుల్ టైమ్ పొలిటీషియనే కావొచ్చు, కానీ రేవంత్ విషయంలో రాహుల్ గాంధీనే జాగ్రత్తగా ఉండాలని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.
