- ప్రమోషన్లతో అదే జిల్లాలో, పక్కజిల్లాల్లో పోస్టింగ్స్ఇవ్వడంపై అనుమానాలు
- సీఎంఓకు ఉద్యోగుల ఫిర్యాదుతో సంచలన విషయాలు వెలుగులోకి..
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఇటీవల జరిగిన బదిలీల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. డిప్యూటీ కమిషనర్ (డీసీ), ఎక్సైజ్ సూపరింటెండెంట్ (డీపీఈఓ), అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కేడర్‌లలో జరిగిన ఈ భారీ బదిలీల వెనుక రూ. కోట్లలో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన, ఆదాయం ఎక్కువగా ఉండే స్థానాల (ఫోకల్ పోస్టులు) కోసం భారీ స్థాయిలో సిఫార్సులు, ముడుపుల పర్వం నడిచిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా రెండు సామాజికవర్గాల అధికారులకే ప్రాధాన్యత ఇవ్వడం ఇందుకు ఊతమిస్తోంది. ఈ పరిణామాలపై పలువురు అధికారులు సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల14 మంది డీసీలు, 35 ఎక్సైజ్ సూపరింటెండెంట్లు.. 9 మంది ఎసీలు బదిలీ అయ్యారు.
ఒకే ప్రాంతంలో ఉండేలా ఫోకల్
కీలక స్థానాల్లో ఉన్న డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ల బదిలీలు కేవలం ఒకే జిల్లా పరిధిలో, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి లాంటి కీలక ప్రాంతాల చుట్టూ తిరుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. సీనియర్ అధికారులకు పదోన్నతులు లభించినప్పటికీ, వారిని అదే జిల్లాలో ఉంచడం, లేదంటే పక్క జిల్లాలోనే పోస్టింగ్స్ ఇవ్వడం చేశారు. సీట్లు మారినా, వారి కార్యాలయాలు లేదా పనిచేసే భవనాలు కూడా మారకుండా ఉన్నట్లు జీవోలను పరిశీలిస్తే అర్థమవుతోంది.
మహబూబ్‌నగర్ జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీగా ఉన్న ఓ అధికారికి పదోన్నతి లభించినా, ఆయనను అదే జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా నియమించడం విశేషం. అలాగే, మరో అధికారి కూడా గతంలో సీఐ, ఎస్ హెచ్ ఓ, ఏఈఎస్ వంటి వివిధ బాధ్యతలను రంగారెడ్డి జిల్లా చుట్టూనే నిర్వహించి, ఇప్పుడు సికింద్రాబాద్ డీపీఈవోగా బదిలీ చేయడం గమనార్హం. ఓ ఆఫీసర్ మల్కాజ్‌గిరి, ఎస్టీఎఫ్ తదితర పోస్టింగులలో గత 8 ఏండ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొనసాగుతున్నారు. మరో ఆఫీసర్ మెదక్ డీసీ నుంచి సైబరాబాద్ డీసీగా బదిలీ అవడం ద్వారా తన పూర్వ రంగారెడ్డి, సరూర్‌నగర్ పై పట్టు కొనసాగించేలా చూసుకున్నారనే విమర్శలున్నాయి. ఇలా ఉన్నతాధికారుల సర్వీస్ పోస్టింగులు తమకు అనుకూలమైన ప్రధాన కేంద్రాల చుట్టూనే తిరగడంతో బదిలీల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల అమలు గాలికి..
బదిలీల నిబంధనలను ఎక్సైజ్ శాఖలో ఒక్కో క్యాడర్‌కు ఒక్కోలా అమలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. పై స్థాయి అధికారులకు ఒక నిబంధన అమలు చేయగా, కిందిస్థాయి ఉద్యోగులకు మాత్రం '8ఎఫ్' నిబంధనలను కఠినంగా అమలు చేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నారనే నెపంతో కిందిస్థాయి సిబ్బందిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర జిల్లాలకు బదిలీ చేయడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
