- బిల్లులు సమర్పించిన వారికి జమ చేసిన ఆర్థిక శాఖ
- ఆదేశాలు అమలు చేసినట్టు సీఎంకు నివేదిక
- వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల్లో ఆనందం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖలు, కార్పొరేష న్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న చాలా మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఈ నెల 1వ తేదీన బుధ వారం శాలరీలు జమ చేశారు. గతంలో జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యం వల్ల ఈ వర్గాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తీవ్రంగా పరిగణించిన సీఎం.. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా ఒకటో తేదీనే వేతనాలు అందాలని ఇటీవల అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారం యుద్ధప్రాతిపదికన నిధులను విడుదల చేయడంతో ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ అయ్యాయి. వేతనాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్, అధికారిక ఆమోదం ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు గానూ.. ప్రతి నెల 25వ తేదీ లోపే జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని స్పష్టం చేసింది. నెల చివరి పని దినం నాటికే అన్ని రకాల ఆడిట్ ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించింది.
కాగా, ఈ ఆదేశాల అమలు తీరుపై సీఎం బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించగా, బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగుల ఖాతాల్లోకి బుధవారమే వేతనాలు విజయవంతంగా జమ చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
